Angeline Francis Khoo: ప్రేమికుడి కోసం వేల కోట్లు వదిలేసుకున్న మలేసియా సంపన్నురాలు... ఇన్నాళ్లకు తెరపైకి వచ్చింది!

Malaysian rich woman shares life with lover leaving crores of wealth
  • మలేసియా సంపన్న కుటుంబంలో పుట్టిన ఏంజెలిన్ ఫ్రాన్సిస్ ఖూ
  • ఆక్స్ ఫర్డ్ వర్సిటీలో విద్యాభ్యాసం
  • జెడియా అనే యువకుడితో ప్రేమ
  • వ్యతిరేకించిన తల్లిదండ్రులు
  • రూ.2 వేల కోట్లు వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయిన ఏంజెలిన్
ప్రేమ గొప్పదనం గురించి ప్రపంచవ్యాప్తంగా పురాణాలు, కావ్యాల్లో ఎంత గొప్పగా చెప్పారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు కొత్త నిర్వచనాలను సంతరించుకుంటుంది ప్రేమ. ప్రేమ గుడ్డిది అంటారు... పేద, ధనిక తేడా చూసుకోదంటారు. అందుకు నిదర్శనమే ఈ ప్రేమ వ్యవహారం. 

వేల కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ ఓ మలేసియా సంపన్నురాలు సాధారణ కుటుంబంలో పుట్టిన ప్రేమికుడి కోసం అన్నీ వదులుకుంది. ఆమె పేరు ఏంజెలిన్ ఫ్రాన్సిస్ ఖూ. ఆమె తండ్రి ఖూ కే పెంగ్ మలేసియాలో బడా వ్యాపారవేత్త. తల్లి పాలైన్ ఛాయ్ మిస్ మలేసియా అందాల పోటీల విజేత. 

అన్నివిధాలా ఉన్నతస్థాయిలో కుటుంబంలో పుట్టిన ఏంజెలిన్ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసింది. ఆ సమయంలో జెడియా అనే యువకుడితో ప్రేమలో పడింది. ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలియజేయగా, వారు అంగీకరించలేదు. ఆస్తులు, అంతస్తులు అంటూ మాట్లాడి జెడియాతో తమ కుమార్తె పెళ్లికి వారు ఆమోదించలేకపోయారు. 

అయినప్పటికీ ఏంజెలిన్ పట్టువిడకపోవడంతో, రూ.2 వేల కోట్ల ఆస్తిని వదులుకోవాల్సి ఉంటుందని తల్లిదండ్రులు హెచ్చరించారు. అయితే, ప్రేమకే ఓటేసిన ఏంజెలిన్ ప్రియుడి వెంట వెళ్లిపోయింది. ఓ సాదాసీదా అమ్మాయిలా పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తోంది. ఇదంతా జరిగింది 2008లో. 

ఇన్నాళ్ల తర్వాత ఏంజెలిన్ మళ్లీ వార్తల్లోకెక్కింది. ఇటీవల ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. కోర్టులో వాంగ్మూలం ఇచ్చేందుకు ఏంజెలిన్ కోర్టుకు వచ్చింది. తల్లి గురించి మంచిగా చెప్పిన ఏంజెలిన్... తండ్రిపై మాత్రం విమర్శలు చేసింది. ఏదేమైనా, తల్లిదండ్రులు విడిపోవడం తనకు ఇష్టం లేదని, వారు మళ్లీ కలిస్తే బాగుంటుందని తన మనసులో మాట వెల్లడించింది.
Angeline Francis Khoo
Jedia
Lover
Rich
Malaysia

More Telugu News