Eluri Sambasivarao: ఓట్లు తీసేస్తున్నారు... కేంద్ర ఎన్నికల సంఘానికి పర్చూరు ఎమ్మెల్యే లేఖ

Parchuru MLA Eluri Sambasiva Rao wrote Central Election Commission
  • పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే
  • బీఎల్వోలపై పోలీసులు సమీక్ష చేస్తున్నారని ఆరోపణ
  • టీడీపీ మద్దతుదారుల ఓట్లు పెద్ద ఎత్తున తొలగిస్తున్నారని ఫిర్యాదు
  • ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలన్న ఏలూరి సాంబశివరావు
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ నేత ఏలూరి సాంబశివరావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఓటర్ల  జాబితా సర్వేలో బీఎల్వోలపై పోలీసులు సమీక్ష చేస్తున్నారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తీసేసేందుకు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తన లేఖలో పేర్కొన్నారు. గంపగుత్తగా ఓట్లు తొలగించేందుకు ఎన్నికల సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని వివరించారు. 

వలసలు వెళ్లినవారి ఓట్లను కుట్రతో తొలగిస్తున్నారని, టీడీపీ మద్దతుదారుల ఓట్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాలని ఏలూరి సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. ఆధారాలతో తాము చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపించాలని ఈసీకి స్పష్టం చేశారు.
Eluri Sambasivarao
Election Commission
Votes
Parchuru
TDP
Andhra Pradesh

More Telugu News