AP State Child Rights Commission: తిరుమల నడకదారిలో బాలిక మృతిపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్

State Child Rights Commission reacts on girl died in leopard attack at Alipiri foot way
  • అలిపిరి నడకదారిలో విషాద ఘటన 
  • చిరుత దాడిలో ఆరేళ్ల లక్షిత మృతి
  • పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలన్న బాలల హక్కుల కమిషన్
  • కౌశిక్ అనే బాలుడిపై దాడి చేస్తే ఏం చర్యలు తీసుకున్నారన్న కమిషన్

తిరుమల అలిపిరి నడకదారిలో గత శుక్రవారం రాత్రి లక్షిత అనే ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసి చంపేయడం తెలిసిందే. ఈ విషాదకర ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తీవ్రస్థాయిలో స్పందించింది. 

లక్షిత మృతిపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలంటూ టీటీడీ, అటవీ శాఖ, పోలీసులు, రెవెన్యూ శాఖలను ఆదేశించింది. తిరుమల నడకదారుల్లో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు, ఇనుప స్తంభాలతో కూడిన ఇనుప కంచెలు, లైటింగ్, సెక్యూరిటీ సిబ్బంది నియామకం వంటి చర్యలు తీసుకోవాలని టీటీడీకి స్పష్టం చేసింది. 

గతంలో కౌశిక్ అనే బాలుడిపై చిరుత దాడి చేస్తే ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. తిరుమల శేషాచల అడవుల్లో ఉండే వన్యప్రాణులకు సంబంధించిన సమగ్ర వివరాలు సేకరించాలని పేర్కొంది. నివేదికను వారం రోజుల్లో తమకు అందించాలని గడువు నిర్దేశించింది. 

దీనిపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు మాట్లాడుతూ, లక్షిత అనే బాలికపై చిరుత దారుణంగా దాడి చేసి చంపేసిందని తెలిపారు. ఇది అత్యంత బాధాకరం అని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ మాసంలోనూ కౌశిక్ అనే బాలుడిపై చిరుత దాడి చేయడం బాలల హక్కుల కమిషన్ ను కలచివేసిందని తెలిపారు.

  • Loading...

More Telugu News