Nara Lokesh: అమరావతిలో బాత్రూంలపైనా డ్రోన్లు ఎగరేశారు: నారా లోకేశ్

Nara Lokesh held meeting with Amaravati farmers in Ravela
  • తాడికొండ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • రావెలలో అమరావతి రైతులతో ముఖాముఖి 
  • వ్యాఖ్యాతగా వ్యవహరించిన స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
  • అమరావతి రైతుల పోరాటం ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసమన్న లోకేశ్ 
  • ప్రజల పక్షాన మాట్లాడిన ఉండవల్లి శ్రీదేవిని కూడా వేధించారని వెల్లడి

టీడీపీ యువనేత నారా లోకేశ్ నేడు తాడికొండ నియోజకవర్గం రావెలలో అమరావతి రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ బహిష్కృత నేత ఉండవల్లి శ్రీదేవి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 

ఈ కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడుతూ, ఏపీ రాజధాని కోసం అమరావతి రైతులు ఏటా మూడు పంటలు పండే భూమిని త్యాగం చేశారని కొనియాడారు. ఈ త్యాగం ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసమేనని తెలిపారు. తాము మొదటి నుంచి అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని, అభివృద్ధి వికేంద్రీకరణ చేతల్లో చూపించిన వ్యక్తి చంద్రబాబు అని లోకేశ్ స్పష్టం చేశారు. 

అమరావతిని రాజధానిగా చేసి... అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు పరిశ్రమలు తెచ్చామని వెల్లడించారు. గోదావరి జిల్లాలకు ఆక్వా పరిశ్రమలు  తెచ్చామని తెలిపారు. విశాఖ జిల్లాలకు అదానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ సంస్థలను తీసుకువచ్చామని వివరించారు. 

"గత ఎన్నికలకు ముందు జగన్ అమరావతికి జై కొట్టారు. జగన్ మాటలకు ఆనాడు అందరూ మోసపోయారు. అమరావతి రైతులు చేస్తున్న పోరాటం ఐదు కోట్ల మంది ఆంధ్రులకు సంబంధించినది. 1000 మంది అమరావతి రైతులపై కేసులు పెట్టారు. అమరావతి ఉద్యమం వల్లే నేను తొలిసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లాను. అమరావతి రైతులు మరో 9 నెలలు ఓపిక పట్టాలి. వేధించినవారికి మా ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం. 

అమరావతి కోసం పోరులో రైతులను పోలీసులు లాఠీలతో కొట్టారు, బూటుకాళ్లతో తన్నారు. పొలాల్లో పనిచేసే కూలీలను పలుచోట్లకు తీసుకెళ్లి ఇబ్బందులు పెట్టారు. జై అమరావతి అంటే చాలు కొట్టేవారు, కేసులు పెట్టేవారు. అమరావతిలో బాత్రూంలపైనా డ్రోన్లు ఎగరేశారు. 

అమరావతి రైతులపై 224 కేసులు పెట్టారు. ప్రజల పక్షాన మాట్లాడిన ఉండవల్లి శ్రీదేవి గారిని కూడా ఇబ్బందులకు గురిచేశారు. ఎంపీలుగా గెలిచిన వారే మహిళలను అవమానించే పరిస్థితి వచ్చింది" అంటూ లోకేశ్ ప్రసంగించారు.

  • Loading...

More Telugu News