Pinipe Viswarup: మోకాళ్లపై నన్ను కూర్చోబెట్టలేదు.. నేనే కూర్చున్నాను: మంత్రి విశ్వరూప్ స్పష్టీకరణ

AP Minister Pinipe Viswarup Responds On Photo With Jagan
  • శుక్రవారం అమలాపురంలో మహిళలతో ఫొటో దిగిన సీఎం జగన్
  • సీఎం పక్కన మోకాళ్లపై కూర్చున్న మంత్రి విశ్వరూప్
  • గౌరవానికి భంగం కలిగితే రాజకీయాలను వదిలేస్తానన్న మంత్రి 
  • తమ కుటుంబంలో గొడవలున్నాయన్న ప్రచారం బాధించిందని ఆవేదన
శుక్రవారం అమలాపురంలో పర్యటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలతో ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా మంత్రి పినిపే విశ్వరూప్ సీఎం పక్కన మోకాళ్లపై కూర్చున్నారు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దళిత మంత్రికి సాక్షాత్తూ సీఎం పక్కనే అవమానం జరిగిందంటూ విమర్శలు వినిపించాయి. 

ఈ విమర్శలపై తాజాగా మంత్రి స్పందించారు. అమలాపురం మండలం భట్నవిల్లిలోని తన నివాసంలో నిన్న విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో కింద కూర్చోవడం, వేరెవరో తనను కింద కూర్చోబెట్టడం జరగలేదని పేర్కొన్నారు. సంతోషంగా ఉంటేనే రాజకీయాల్లో కొనసాగుతానని, గౌరవానికి భంగం కలిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు. ఫ్లెక్సీల వివాదంపైనా ఆయన స్పందించారు. సీఎం పర్యటన సందర్భంగా తానే ఫ్లెక్సీలు డిజైన్ చేయించానని తెలిపారు. తనతోపాటు పెద్దకుమారుడు కృష్ణారెడ్డి, రెండో కుమారుడు శ్రీకాంత్ పేర్లతో ఐదేసి చొప్పున ఫ్లెక్సీలు వేయించినట్టు తెలిపారు. 

తన ఫ్లెక్సీలో కుమారుల పేర్లు, వారి ఫ్లెక్సీలో తన పేరు లేకుండా వేయించానని, ఇది చూసిన వారు తమ కుటుంబంలో గొడవలు ఉన్నాయని ప్రచారం చేయడం తనను బాధించిందని అన్నారు. మహిళల కార్యక్రమంలో మోకాళ్లపై కూర్చున్నానంటూ కూడా దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తొలుత స్టేజి ఎక్కలేదని, సీఎం పిలిస్తేనే వెళ్లానని చెప్పారు. వెనకున్న మహిళలకు అడ్డంగా ఉండకూడదన్న ఉద్దేశంతోనే మోకాళ్లపై కూర్చున్నానని, అంతేకానీ, దళిత మంత్రిని అవమానించారని ప్రచారం చేయడం తగదని హితవు పలికారు.
Pinipe Viswarup
YSRCP
Jagan
Amalapuram

More Telugu News