Manipur: ప్లీజ్.. గొడవ పడడం ఆపండి: మైతేయిలు, కుకీలకు మణిపూర్ ముస్లింల విజ్ఞప్తి

Manipur Muslims Request Meiteis and Kukis To Stop Fighting
  • రెండు వర్గాల మధ్య నలిగిపోతున్నామని ఆవేదన
  • రాష్ట్రంలో శాంతి నెలకొల్పాలంటూ కేంద్రానికి వినతి
  • ఉపాధి కోల్పోయి తిండికి ఇబ్బంది పడుతున్నామని వెల్లడి
మణిపూర్ లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే నెమ్మదిస్తున్నాయి. చాలా చోట్ల దాడులు తగ్గిపోయాయి. త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, బిష్ణుపూర్ జిల్లా, చురాచంద్ పూర్ జిల్లాల మధ్య మాత్రం ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వర్గాల మధ్య కాల్పులు, బాంబు దాడులు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. బిష్ణుపూర్ జిల్లాలో మైతేయిల ప్రాబల్యం ఎక్కువగా ఉండగా.. చురాచంద్ పూర్ జిల్లాలో కుకీల జనాభా ఎక్కువ. ఈ రెండు జిల్లాల మధ్య దాడులు జరుగుతుండడంతో మధ్యలో ఉన్న మిగతా వర్గాలకు చెందిన ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు.

మైతేయిలు, కుకీల దాడులతో తమకు ఉపాధి లేకుండా పోయిందని, ఇంట్లో నుంచి బయటకు రావడం కూడా వీలుచిక్కడం లేదని మణిపూర్ లోని ముస్లింలు వాపోతున్నారు. గొడవల నేపథ్యంలో కనీస అవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, తిండి దొరకక చాలా కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని చెబుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న గొడవలతో సంబంధం లేకపోయినా తమ జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని వివరించారు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో రోజులు గడుపుతున్నామని తెలిపారు.

బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్తా గ్రామం చురాచంద్ పూర్ జిల్లా సరిహద్దులకు దగ్గర్లో ఉంటుంది. అక్కడ ముస్లిం పంగల్స్ జనాభా ఎక్కువ. ప్రస్తుతం ఈ గ్రామం భద్రతా బలగాల రక్షణలో ఉంది. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ తమను వీడట్లేదని ముస్లింలు చెబుతున్నారు. ఓవైపు ఉపాధి కోల్పోయి, మరోవైపు మసీదులో ప్రార్థన చేసుకునే వీలు కూడా లేకుండా పోయిందని వాపోతున్నారు. గొడవ పడడం ఆపాలంటూ మైతేయిలు, కుకీలకు ముస్లింలు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేలా చూడాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హింసాత్మక దాడుల నేపథ్యంలో తమ గ్రామానికి సెక్యూరిటీ మరింత పెంచాలని కోరేందుకు కొంతమంది ముస్లిం ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లారని సమాచారం.
Manipur
violence
manipur muslims
meiteis
kukis
Bhishnupur
stop figting

More Telugu News