Mann Ki Baat: ముస్లింల మన్ కీ బాత్ వినండి.. ప్రధానికి జామా మసీదు షాహీ ఇమామ్ విజ్ఞప్తి

  • శుక్రవారం మసీదులో షాహీ ఇమామ్ ఆధ్యాత్మిక ప్రసంగం
  • ఈ సందర్భంలో దేశంలో విద్వేష పూరిత వాతావరణంపై ఆందోళన
  • ప్రస్తుతం ముస్లింలు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని వెల్లడి
Jama masjid shahi imam urge pm modi to listen to muslims mann ki baat

దేశంలో విద్వేషం తుపానులా విస్తరిస్తోందని జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింల మన్‌ కీ బాత్ వినాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మసీదులో ఆయన ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన నూహ్ ఘర్షణలు, రైల్వే పోలీసు కాల్పుల్లో నలుగురు బలికావడం వంటి ఉదంతాలను ప్రస్తావించారు. దేశంలో విస్తరిస్తున్న విద్వేష భావన ఆందోళనకరమని, శాంతిస్థాపనకు ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. 

‘‘మీరు(ప్రధాని మోదీ) తరచూ ‘మన్ కీ బాత్’ గురించి మాట్లాడతారు కాబట్టి ముస్లింల మన్ కీ బాత్‌ను ఆలకించండి. ప్రస్తుత పరిస్థితులు చూసి ముస్లింలు ఇబ్బంది పడుతున్నారు. తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. విద్వేషం, మతదాడుల నుంచి ముస్లింలను రక్షించడంలో చట్టాలు బలహీనంగా ఉన్నాయని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఓ మతానికి చెందిన వారిని బహిరంగంగా బెదిరిస్తున్నారు. ముస్లింలను బహిష్కరించాలని, వారితో వ్యాపారవాణిజ్య లావాదేవీలు తెంచుకోవాలంటూ పంచాయతీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోని 57 ఇస్లామిక్ దేశాల్లో ముస్లిమేతరులు ఎవరూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవట్లేదు’’ అని వాపోయారు.

More Telugu News