Mahua Moitra: ప్రధాని గారూ వింటున్నారా?.. పార్లమెంటులో నిప్పులు చెరిగిన తృణమూల్ ఎంపీ మహువా

India will say anyone but Modi after Manipur Trinamool MP Mahua Moitra
  • ఇండియాపై విశ్వాసం ప్రదర్శించేందుకే అవిశ్వాసం పెట్టామన్న టీఎంసీ ఎంపీ
  • ఆరడుగుల లోతున పాతిపెట్టిన సిద్ధాంతాలను వెలికి తీసేందుకే అవిశ్వాసం పెట్టామని స్పష్టీకరణ
  • సభ్యుల మాటలు వినేందుకు రాని మోదీ.. తన మాటలు వినిపించేందుకు వచ్చారని ఎద్దేవా
  • 37 శాతం ఓట్లున్న పార్టీ బెదిరిస్తుంటే భయపడబోమన్న మహువా మెయిత్రా
‘‘అధికారపార్టీ సభ్యులతోపాటు బిజు జనతాదళ్, వైసీపీ లాంటి మిత్రులు ప్రభుత్వాన్ని పడగొట్టలేరని మమ్మల్ని ఎగతాళి చేయొచ్చు. పార్లమెంటులో మాకు సంఖ్యాబలం లేకున్నా ఇండియాపై విశ్వాసం ప్రదర్శించడానికే అవిశ్వాసం పెట్టాం’’ అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రా స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానంపై నిన్న ఆమె పార్లమెంటులో మాట్లాడుతూ.. అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. తాము అవిశ్వాస తీర్మానం పెట్టింది ఎవరినో దించడానికి కాదని, ఆరడుగుల లోతున పాతిపెట్టిన భారతీయ సిద్ధాంతాలు, సమానత్వం, సెక్యులరిజం లాంటి వాటిని వెలికి తీయడానికేనని పేర్కొన్నారు.

పార్లమెంటులో తరచూ నోరుమూసుకోమని చెప్పే ప్రధాని నరేంద్రమోదీ ఇప్పుడు మణిపూర్ గవర్నర్‌ను కూడా ఇలాగే ఆదేశించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల మాటలు వినేందుకు మంగళ, బుధవారాల్లో సభకు రాని మోదీ.. గురువారం మాత్రం తన మాటలను సభ్యులకు వినిపించేందుకు వచ్చారని ఎద్దేవా చేశారు. ‘‘ప్రధాని గారూ.. మీరు వింటున్నారా? మణిపూర్ పాలనా వ్యవస్థను మార్చండి. పార్టీలు కలిసి పనిచేయడానికి అవకాశం ఇవ్వండి" అని మహువా కోరారు. ప్రధానిపై దేశం విశ్వాసం కోల్పోయిందన్న ఎంపీ.. 37 శాతం ఓట్లున్న పార్టీ అధికారంలోకి వచ్చి బెదిరిస్తుంటే మిగిలిన 63 శాతం ఓట్లున్న పార్టీలు భయపడబోవని తేల్చి చెప్పారు.
Mahua Moitra
TMC
No-Confidence Motion
BJP
BJD
YSRCP

More Telugu News