Joe Biden: చైనా ఓ టైం బాంబ్.. ఎప్పుడైనా పేలిపోవచ్చు: అమెరికా అధ్యక్షుడు బైడెన్

Joe biden calls china a ticking time bomb
  • డిఫ్లేషన్‌లో పడిపోయిన చైనా
  • ఆర్థికమందగమనంతో వస్తుసేవలకు తగ్గిన డిమాండ్, ధరల్లో కోత
  • సమస్య నుంచి బయటపడేందుకు చైనా చెడ్డపనులకు దిగొచ్చని  బైడెన్ హెచ్చరిక

ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చైనాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టైంబాంబుతో పోల్చారు. అది ఏ క్షణమైనా పేలిపోవచ్చని వ్యాఖ్యానించారు. ‘‘వాళ్లకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇది మనకు మంచిది కాదు. ఎందుకంటే సమస్యల్లో చిక్కుకున్న చెడ్డవాళ్లు చెడ్డపనులు చేయచ్చు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్‌లో ఓ నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్ చైనా అధ్యక్షుడు ఓ నియంత అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, చైనా అప్పట్లో అగ్గిమీద గుగ్గిలమైంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ తాజా చైనా పర్యటన ముగిసిన వెంటనే బైడెన్ చైనాపై విమర్శలు గుప్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ప్రస్తుతం చైనా డిఫ్లేషన్‌లో కూరుకుపోయింది. నగదు లభ్యత తగ్గిపోవడంతో వస్తువుసేవల ధరలు క్షీణించడం ప్రారంభించాయి. దీన్నే ఆర్థికపరిభాషలో డీఫ్లేషన్ అంటారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినప్పుడు ప్రజల చేతుల్లో నగదు నిల్వలు తగ్గిపోయి వస్తుసేవలకు డిమాండ్ తగ్గుతుంది. ఇది ధరల క్షీణతకు దారి తీస్తుందని అర్థిక రంగ నిపుణులు చెబుతారు. 

సెమీకండెక్టర్ వంటి కీలక రంగాలకు చెందిన అమెరికా సంస్థ చైనాలో పెట్టుబడులు పెట్టకూడదంటూ బైడెన్ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దేశభద్రత రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. దీనిపై చైనా ఘాటుగా స్పందించింది. అమెరికాపై దీటుగా ప్రతిచర్యలు తీసుకునే హక్కు తమకుందని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News