Pawan Kalyan: వర్షపాతం 24 మి.మీ.. రక్తపాతం 34 మి.మీ అంటూ పవన్‌ కల్యాణ్​ ‘ఓజీ’ నుంచి క్రేజీ అప్‌డేట్

  • బ్రో చిత్రంతో హిట్ ను ఖాతాలో వేసుకున్న పవన్ కల్యాణ్
  • సుజీత్ దర్శకత్వంలో ఓజీలో నటిస్తున్న పవర్ స్టార్
  • సెప్టెంబర్‌‌2న ’ఓజీ’ నుంచి రానున్న పవన్ పుట్టిన రోజు కానుక
Pawan kalyan OG Fire Storm Is Coming on September 2nd

బ్రో సినిమాతో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు కంప్లీట్ యాక్షన్ చిత్రం ‘ఓజీ’తో రానున్నారు. ర‌న్ రాజా ర‌న్, సాహో వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుజిత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. సెప్టెంబర్ 2న అగ్ని తుఫాను రాబోతోందంటూ ఈ రోజు చిత్ర బృందం ఓ పోస్టర్‌‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇందులో అర్ధరాత్రి సమయంలో విలన్లను ఊచకోత కోసి తన అనుచరులతో హీరో వెళ్తున్న ఫొటోతో కూడిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.

.పోస్టర్‌‌లో ఓ చోట ‘లొకేషన్ చర్చి గేట్ సౌత్ బొంబాయి. టైమ్ ఉద‌యం 2 :18, వర్షపాతం సాంద్రత 24 మి.మీ, రక్తపాతం సాంద్రత 34 మి.మీ. వాడిన ఆయుధాలు : డబుల్ బారెల్ షాట్‌గన్’ అని రాసి ఉంది. ఈ పోస్టర్‌‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘హీట్ వేవ్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. అగ్ని తుఫాను సెప్టెంబర్ 2న వస్తోంది. ఓజీ అభిమానులారా ధైర్యంగా ఉండండి’ అంటూ క్యాప్షన్స్ ఇచ్చింది. సెప్టెంబర్ 2న పవన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఓజీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ లేదా టీజర్‌‌ను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

More Telugu News