manipur: మణిపూర్ హింస సిగ్గుచేటని అంగీకరిస్తున్నాం.. ప్రతిపక్షాలు ఈ అంశంపై నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయి!: అమిత్ షా

Manipur violence shameful politics over it even more shameful Amit Shah says in Lok Sabha
  • ప్రతిపక్షాల రాజకీయం మరింత సిగ్గుచేటన్న అమిత్ షా 
  • ఆరున్నరేళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ కనీసం కర్ఫ్యూ విధించలేదని వెల్లడి
  • మొదటి నుండి తాము చర్చలకు సిద్ధమని చెప్పామన్న అమిత్ షా
  • హైకోర్టు తీర్పు తర్వాత ఘర్షణలు జరిగాయని స్పష్టీకరణ
  • కుకీ గ్రామాల్లో పుకార్లు వ్యాపించడంతో ఘర్షణలు మరింత పెరిగాయన్న కేంద్రమంత్రి 
మణిపూర్ హింసాత్మక ఘటనలు సిగ్గుచేటు అని తాము అంగీకరిస్తున్నామని, కానీ విపక్షాలు ఈ అంశంపై నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని, ఇది మరింత సిగ్గుచేటని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్ సభలో ఆయన మాట్లాడుతూ... తాము అధికారంలోకి వచ్చాక ఈశాన్య రాష్ట్రంలో హింస గణనీయంగా తగ్గిందన్నారు. మణిపూర్ ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదన్నారు. ఈ ఘటన బాధాకరమన్నారు. ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రాలను 50సార్లకు పైగా సందర్శించారన్నారు. మణిపూర్ ఘటనపై చర్చకు కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. కానీ విపక్షాలకు చర్చించడం ఇష్టం లేదన్నారు.

మణిపూర్ అంశంపై చర్చకు సిద్ధమని స్పీకర్ కు లేఖ రాసినట్లు చెప్పారు. కేంద్రం చర్చకు ఒప్పుకోవడం లేదని ప్రచారం చేశారని, కానీ చర్చకు సిద్ధమని తాము మొదటి రోజు నుండి చెబుతూనే ఉన్నానని చెప్పారు. ఆరున్నరేళ్లుగా మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం ఉందని, అక్కడ ఒక్కసారీ కర్ఫ్యూ విధించలేదన్నారు. మే వరకు మణిపూర్‌లో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదన్నారు. మణిపూర్‌ను రాహుల్ గాంధీ రాజకీయం చేశారన్నారు. తమ సహాయమంత్రి 23 రోజుల పాటు మణిపూర్‌లోనే ఉన్నారన్నారు. తాను స్వయంగా మూడురోజుల పాటు అక్కడే ఉన్నానని చెప్పారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలను మొదట సందర్శించిన వారిలో తాను ఉన్నానని చెప్పారు.

మణిపూర్ హింసాత్మక ఘటనపై దాచడానికి ఏమీ లేదని, తాము మౌనం పాటించడం లేదన్నారు. శాంతిని నెలకొల్పేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేశామన్నారు. మూడు రోజుల పాటు మోదీ తనతో మాట్లాడారన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం లేదని, సహకరించకపోతే మార్చవలసి ఉంటుందని, కానీ బీరెన్ సింగ్ సహకరిస్తున్నారన్నారు. సరిగ్గా పని చేయని అధికారులను ముఖ్యమంత్రి మార్చినట్లు చెప్పారు. మణిపూర్ క్రమంగా కోలుకుంటోందని, అగ్నికి ఆజ్యం పోయవద్దన్నారు. ఇప్పటి వరకు 152 మంది చనిపోయారని, ఒక్క మే నెలలోనే 107 మంది మృతి చెందినట్లు చెప్పారు. వైరల్ వీడియో ఘటన గురించి కూడా లోక్ సభలో ప్రస్తావించారు. ఈ వీడియోను పోలీసులకు ఇచ్చి ఉండాల్సిందన్నారు.

హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు హింసకు దారి తీశాయన్నారు. మెయితీ తెగను గిరిజనులుగా ప్రకటించాక ఘర్షణలు చోటు చేసుకున్నాయని, మే 3న ఈ ఘర్షణలు ప్రారంభమయ్యాయన్నారు. కుకీ గ్రామాల్లో పుకార్లు వ్యాపించడంతో ఈ ఘర్షణలు మరింత పెరిగాయన్నారు. మెయితీ, కుకీలతో చర్చలు జరుపుతున్నామని, పరిస్థితిని అదుపులోకీ తీసుకు వస్తామన్నారు. 

పాకిస్థాన్‌తో చర్చలు ఉండబోవని చెప్పాం

పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు ఉండవని తాము స్పష్టంగా ప్రకటించామన్నారు. కానీ కశ్మీర్ యువతతో మాత్రం చర్చిస్తామన్నారు. జమ్ము కశ్మీర్‌పై తాము కీలక నిర్ణయం తీసుకున్నామని, ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. చైనా సరిహద్దుల్లో చివరి గ్రామం వరకు రోడ్లు వేశామన్నారు. ఆర్టికల్ 370 వరకు ద్వంద్వ ప్రమాణాలు తొలగించామన్నారు. రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలను తొలగించామన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తే అల్లకల్లోలం అవుతుందని విపక్షాలు భయపెట్టాయన్నారు. తాము వామపక్ష తీవ్రవాదంపై దృష్టి సారించామన్నారు.
manipur
Amit Shah
Narendra Modi
BJP
Lok Sabha
Congress

More Telugu News