Abbas: హీరో విశాల్ తో గొడవ గురించి వెల్లడించిన 'ప్రేమదేశం' అబ్బాస్

Abbas reveals clash with Vishal
  • ప్రేమదేశం చిత్రంతో ఒక్కసారిగా స్టార్ గా మారిన అబ్బాస్
  • తర్వాత కాలంలో వరుస పరాజయాలు
  • న్యూజిలాండ్ లో స్థిరపడిన అబ్బాస్
  • ఇటీవలే భారత్ కు రాక
  • అభిమానులతో చిట్ చాట్ లు, ఇంటర్వ్యూలతో బిజీ
ప్రేమదేశం సినిమాతో దక్షిణాదిలో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్న నటుడు అబ్బాస్. తొలి సినిమాతోనే స్టార్ డమ్ అందుకున్న అబ్బాస్... తర్వాత కాలంలో తన కెరీర్ ను విజయవంతంగా కొనసాగించలేకపోయాడు. మల్టీస్టార్టర్ లతో కొన్ని హిట్లు అందుకున్నప్పటికీ, సోలోగా మెప్పించలేకపోయాడు. 

క్రమంగా తెరమరుగైన అబ్బాస్ న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. చాలాకాలంగా అక్కడే ఉంటున్న అబ్బాస్ ఇటీవలే భారత్ వచ్చాడు. తన అభిమానులను కలుస్తూ, ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. గతంలో జరిగిన ఓ సంఘటన గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 

సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ సందర్భంగా హీరో విశాల్ తో గొడవ జరగడంపై వివరించాడు. సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ రెండో సీజన్ లో విశాల్ తనపై మిగతావారికి అబద్ధాలు చెప్పాడని, తన మాటలతో ఇతరులను కూడా ప్రభావితం చేశాడని అబ్బాస్ తెలిపాడు. ఆ రోజున తనకు చాలా బాధ కలిగిందని, ఆ వివాదంలో తానే వెనక్కి తగ్గానని గుర్తు చేసుకున్నాడు. అలాంటి వాతావరణంలో ఒక్క నిమిషం కూడా ఉండదలచుకోలేదని పేర్కొన్నాడు. 

ఆ ఘటన పట్ల విశాల్ కూడా చింతించి ఉంటాడనుకుంటున్నానని, ఏదేమైనా అతడిప్పుడు ఎదురుపడితే హాయ్ అని పలకరించలగలనేమో కానీ, సన్నిహితంగా మాట్లాడలేనని అబ్బాస్ స్పష్టం చేశాడు. 

ఆ గొడవ సందర్భంగా విశాల్ వ్యవహరించిన తీరు దారుణం అని, అతడిపై కక్ష కాదు కానీ, కోపం మాత్రం ఉండేదని వివరించాడు. తర్వాత కాలంలో ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని, అతడిని క్షమించేశానని తెలిపాడు. ఎవరితోనైనా సన్నిహితంగా ఉంటానేమో కానీ, విశాల్ విషయంలో మాత్రం అది ఎప్పటికీ జరగదని అబ్బాస్ స్పష్టం చేశాడు.
Abbas
Vishal
Kollywood
Actor

More Telugu News