Hyderabad District: భర్తను కోల్పోయిన యువతితో ప్రేమ.. పెళ్లి మాటెత్తిందని ట్యాంకర్ కిందకు తోసి హత్య

Man pushes woman under the lorry after she pressurizes him for marriage in Hyderabad
  • బాచుపల్లిలో వెలుగు చూసిన ఘటన
  • భర్తను కోల్పోయిన యువతికి దగ్గరయ్యాక మరో మహిళతో నిందితుడి నిశ్చితార్థం
  • తననే పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తేవడంతో హత్య
  • యువతి ప్రమాదవశాత్తూ మరణించిందని తొలుత నిందితుడి బుకాయింపు
  • పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో చివరకు నేరం ఒప్పుకున్న వైనం
భర్తను కోల్పోయిన యువతితో ప్రేమాయణం నడిపిన ఓ యువకుడు ఆమె పెళ్లికి బలవంతం పెట్టగానే ట్యాంకర్ కిందకు తోసి హత్య చేశాడు. హైదరాబాద్‌ బాచుపల్లిలో ఆదివారం ఈ దారుణం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే, కామారెడ్డి జిల్లాకు చెందిన హరిజియా కుమార్తె భుక్యా ప్రమీల కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచ్చింది. గతేడాది ఆమె వివాహం కాగా ఏప్రిల్‌లో ఆమె భర్త చనిపోయాడు. బాచుపల్లిలోని ఓ స్టీలు దుకాణంలో ఆమె పనిచేస్తోంది. 

కాగా, ప్రమీలకు తన సొంతూరుకు చెందిన భుక్యా తిరుపతి నాయక్‌తో చిన్నప్పటి నుంచే పరిచయం. భర్తను కోల్పోయాక ప్రమీల తిరుపతికి దగ్గరయ్యారు. అయితే, అతడు ఇటీవల ప్రమీలను మోసపుచ్చి మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఆమె తనను పెళ్లి చేసుకోవాలంటూ తిరుపతిపై ఒత్తిడి తెచ్చింది. లేకపోతే విషయం అతడి తల్లిదండ్రులకు చెబుతానని హెచ్చరించింది. 

ఈ విషయమై చర్చించేందుకు ఆదివారం కలుద్దామని ప్రమీల తిరుపతితో చెప్పింది. ఈ క్రమంలో తిరుపతి మరో స్నేహితుడితో ద్విచక్రవాహనంపై బాచుపల్లి రహదారి వద్ద ఉన్న ఆమె వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య మరోసారి వాదోపవాదాలు జరగడంతో క్షణికావేశానికి లోనైన తిరుపతి ఆమెను అటువైపు వస్తున్న ట్యాంకర్ కింద తోసేశాడు. దీంతో, ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. యువతి ప్రమాదవశాత్తూ మరణించిందని తొలుత నమ్మించేందుకు ప్రయత్నించిన తిరుపతి చివరకు పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో తానే ఈ హత్య చేసినట్టు అంగీకరించాడు.
Hyderabad District
Crime News
Telangana

More Telugu News