Chiranjeevi: తమన్నా ఆ బాధను మనసులో దాచుకుని డ్యాన్స్ చేసింది: చిరంజీవి

Chiranjeevi talks about Tamannaah dedication towards cinema
  • చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళాశంకర్
  • ఆగస్టు 11న రిలీజ్
  • ప్రమోషన్ ఈవెంట్లతో చిరు గ్యాంగ్ బిజీ
  • తమన్నా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్టయినర్ చిత్రం భోళాశంకర్. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రచార కార్యక్రమాల్లో చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఓ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడారు. 

తమన్నాను చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుందని తెలిపారు. భోళాశంకర్ చిత్రంలోని మిల్కీ బ్యూటీ పాట చిత్రీకరణ సమయంలో తమన్నా వాళ్ల నాన్నకు శస్త్రచికిత్స జరిగిందని చిరంజీవి వెల్లడించారు. 

కానీ, తమన్నా వృత్తి ధర్మం పాటిస్తూ, షూటింగ్ లో కొనసాగిందని తెలిపారు. షాట్ గ్యాప్ లో వాళ్ల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ధైర్యం చెప్పేదని గుర్తు చేసుకున్నారు. తండ్రి ఆరోగ్యం పట్ల ఎంతో బాధ ఉన్నప్పటికీ, మనసులో దాచుకుని ఆ పాటకు డ్యాన్స్ చేసిందని కొనియాడారు. సినిమా పట్ల ఎంత అంకితభావం ఉంటేనో తప్ప అలా చేయలేరని కితాబిచ్చారు. 

ఇక దర్శకుడు మెహర్ రమేశ్ గురించి చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఒక్కసారి సెట్లోకి వస్తే ఎంత ప్రొఫెషనల్ గా ఉంటానో దర్శకుడు మెహర్ రమేశ్ కు తెలుసని, అందుకే అతడికి చలికాలంలో చెమటలు పట్టేవని సరదాగా చెప్పారు. తాను సెట్లోకి వస్తుంటే మెహర్ రమేశ్ లో వణుకు మొదలయ్యేదని చమత్కరించారు.

"ముఖ్యంగా నాపై సీన్లు షూట్ చేసేటప్పుడు అతడు చాలా శ్రద్ధ చూపించేవాడు. సినిమాలోని ప్రతి సీన్ ను మెహర్ రమేశ్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే చిత్రీకరించాడు. మెహర్ రమేశ్ నాకు తమ్ముడిలాంటివాడు" అని చిరంజీవి వివరించారు. 

ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన భోళాశంకర్ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Chiranjeevi
Tamannaah
Bhola Shankar
Promotions

More Telugu News