Nara Lokesh: జగన్ బ్యాచ్ కు గుండు కొట్టించే రోజు దగ్గర్లోనే ఉంది: లోకేశ్

  • వినుకొండ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • పుచ్చకాయల బోడు వద్ద లోకేశ్ సెల్ఫీ
  • వైసీపీ దెబ్బకు కొండలు, గుట్టలు కూడా మాయమవుతున్నాయని వ్యాఖ్యలు
  • ప్రకృతి సంపదను యధేచ్చగా దోచేస్తున్నారని విమర్శలు
  • టీడీపీని గెలిపిస్తే అభివృద్ధి, సంక్షేమం మరింత ఎక్కువగా చేస్తామని హామీ
Lokesh slams CM Jagan and YCP leaders

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో హోరెత్తిస్తోంది. 175వ రోజు లోకేశ్ పాదయాత్ర వనికొండ క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. ఈపూరు పుచ్చకాయల బోడు వద్ద సెల్ఫీ దిగిన లోకేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ దొంగల దెబ్బకు కొండలు, గుట్టలు, వాగులు, వంకలు మాయమవుతున్నాయని ఆరోపించారు. 

"ఇది వినుకొండ నియోజవర్గం ఈపూరు పుచ్చకాయల బోడులోని సర్వే నెం.174/2లో ఉన్న కొండ ప్రాంతం. 3.16 ఎకరాల విస్తీర్ణంలోని కొండబోడును ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు నేతృత్వంలో ఆయన అనుచరులు ఇష్టారాజ్యంగా తవ్వేసి కోట్లాది రూపాయల గ్రావెల్ దోచేశారు. 

అధికారం కోల్పోయేనాటికి ఆంధ్రప్రదేశ్ లో కొండలనేవి కన్పించకూడదని సైకో బ్యాచ్ ఒట్టు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రకృతి సంపదను యధేచ్చగా దోచేస్తున్న జగన్ అండ్ కోకు రాష్ట్ర ప్రజలు బోడి గుండు కొట్టించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. 

బొమ్మరాజుపల్లిలో సుగాలీ/ లంబాడీ/ బంజారా సామాజికవర్గం ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. 

వినుకొండ నియోజకవర్గంలో ఐటీడీఏ తీసుకువస్తాం

గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేసింది టీడీపీ, స్వర్గీయ ఎన్టీఆర్ గిరిజనుల అభివృద్ధి కోసం ఐటీడీఏల ద్వారా బాటలు వేశారు, చంద్రబాబునాయుడు గిరిజన తాండాల రూపురేఖలు మార్చారు. గిరిజనుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. 

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం. మొదటి మూడేళ్లలో వరికపుడిశెల ప్రాజెక్టు పూర్తి చేసి పల్నాడులో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం.

గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తాం

అధికారంలోకి వచ్చాక ఖాళీగా ఉన్న అన్ని టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేసిన చరిత్ర టీడీపీది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని జగన్ రద్దు చేశాడు. జాతీయ విద్యా విధానం పేరుతో స్కూల్స్ మూసేస్తున్నాడు, టీచర్ల సంఖ్య తగ్గిస్తున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తాం. 

గిరిజనుల ఉపాధికి ప్రత్యేక ప్రణాళిక అమలు

అరకు కాఫీ, తేనె తదితర అటవీ ఉత్పత్తులను ఎలా అయితే ప్రమోట్ చేసి గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించామో... అలాగే, మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. వినుకొండ ప్రాంతానికి ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేస్తాం. 

గిరిజనులను జగన్ మోసం చేశాడు. 500 కంటే ఎక్కువ జనాభా ఉన్న తాండాలను పంచాయతీలుగా గుర్తిస్తానని మాట తప్పాడు. 45 ఏళ్లు నిండిన ఎస్టీ మహిళలకు పెన్షన్ ఇస్తానని జగన్ మాట తప్పాడు.

16 సంక్షేమ పథకాలను రద్దు చేశాడు!

జగన్ అధికారంలోకి వచ్చాక 16 గిరిజన సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. గత ప్రభుత్వాలు గిరిజనుల జీవనోపాధి కోసం ఇచ్చిన వ్యవసాయ భూముల్ని జగన్ ప్రభుత్వం వెనక్కి లాక్కుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రద్దు చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తాం. 

వినుకొండకి పరిశ్రమలు తీసుకొచ్చి గిరిజనులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం. బంజారా భవనాలు నిర్మిస్తాం. సేవా లాల్ మహారాజ్ జయంతి కార్యక్రమం అధికారికంగా జరుపుతాం. 

తాండాల్లో నివసించే వారికి మెరుగైన వైద్య సహాయం అందించే విధంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. అవసరమైన మేర మందులు, డాక్టర్లను ఏర్పాటు చేస్తాం.

తాండాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే... మిగిలిపోయిన తాండాలను పంచాయతీలుగా గుర్తించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, త్రాగునీరు, మరుగుదొడ్లు, ఇళ్లు నిర్మిస్తాం. టీడీపీ 500 జనాభా ఉన్న తాండాలను పంచాయతీలుగా గుర్తించింది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి/ లంబాడీ/ బంజారా సామాజికవర్గం సంక్షేమం, అభివృద్ది కోసం కృషి చేస్తాం. 

రూ.200 పెన్షన్ ని రూ.2000 వేలు చేసిన ఘనత చంద్రబాబు గారిది. రూ.750 పెంచడానికి జగన్ కి నాలుగేళ్ల మూడు నెలలు పట్టింది. మూడు వేలు పెన్షన్ అని చెప్పిన జగన్ వృద్ధులను మోసం చేశాడు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించండి... అభివృద్ది, సంక్షేమం మరింత ఎక్కువగా చేసే బాధ్యత నాది.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2332.7 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 19.2 కి.మీ.*

*176వరోజు (6-8-2023) యువగళం వివరాలు*

*వినుకొండ/మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలు*

సాయంత్రం

4.00 – జయంతిరామపురం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.10 – జయంతిరామపురంలో స్థానికులతో సమావేశం.

4.55 – మేళ్లవాగులో స్థానికులతో సమావేశం.

5.25 – రెడ్డిపాలెంలో స్థానికులతో సమావేశం.

6.25 – మాచర్ల నియోజకవర్గంలోకి ప్రవేశం.

7.10 – శ్రీచక్ర సిమెంట్స్ వద్ద స్థానికులతో సమావేశం.

8.10 – కారంపూడి శివారు విడిది కేంద్రంలో బస.

******

More Telugu News