Kesineni Nani: ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి... మీరు జోక్యం చేసుకోవాలి: ప్రధాని మోదీకి కేశినేని నాని లేఖ

TDP MP Kesineni Nani wrote PM Modi on law and order situation in AP
  • నిన్న చంద్రబాబు పర్యటన ఉద్రిక్తం
  • అంగళ్లు, పుంగనూరులో హింసాత్మక ఘటనలు
  • ఇలాగే వదిలేస్తే ఏపీ దారుణంగా తయారవుతుందన్న ఎంపీ నాని 
  • ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటన

ఏపీలో శాంతిభద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు భద్రత లోపిస్తోందని టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మీరు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఏపీలో పరిస్థితులు దారుణంగా తయారవుతాయని తెలిపారు. 

"వైసీపీ కార్యకర్తలు హింసాత్మక చర్యలకు పాల్పడడం వల్ల సాధారణ పౌరులు, పోలీసులు గాయపడుతున్నట్టు ఇటీవల ఘటనలు నిరూపిస్తున్నాయి. వైసీపీ విధ్వంసకాండ వల్ల ప్రజా ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఘటనలే అందుకు నిదర్శనం. 

చంద్రబాబు పర్యటనను దెబ్బతీసేందుకు వైసీపీ మంత్రులే గూండాలను పంపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది తీవ్రంగా కలవరపరిచే అంశం. ఇరు పార్టీ శ్రేణుల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం సాధారణ పౌరులను భయభ్రాంతులకు గురిచేయడమే కాదు, ప్రజాస్వామ్యానికి, ప్రజల హక్కులకు పెను ముప్పుగా భావించాలి. 

పోలీసులు ఉన్నది సమాజంలో శాంతిభద్రతలు కాపాడడానికే. కానీ, వినిపిస్తున్న వాదనలను బట్టి చూస్తే... నిన్నటి ఘటనల్లో పోలీసులు తగిన విధంగా స్పందించలేదని అర్థమవుతోంది. ఆఖరికి పోలీసులపైనే దాడులు జరిగే పరిస్థితి వచ్చింది. దాంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. 

ఈ ఘటనల్లో లోతైన దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా శాంతిభద్రతల పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా... దేశ ప్రధాని అయిన మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను... వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోండి... ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలను పునరుద్ధరించండి. 

చంద్రబాబు, ఇతర నేతల భద్రతను కట్టుదిట్టం చేయడం అత్యంత ముఖ్యం. ఎలాంటి తీవ్ర పరిణామాలు జరగకుండా ఉండాలంటే ఈ మేరకు చర్యలు తప్పనిసరి. అంగళ్లు, పుంగనూరు ఘటనలపై విచారణ జరిపేలా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని మిమ్మల్ని కోరుతున్నాను" అంటూ కేశినేని నాని తన లేఖలో కోరారు.

  • Loading...

More Telugu News