Nara Lokesh: నేను ముందే చెప్పా... ఇప్పుడదే నిజం అయింది: నారా లోకేశ్

  • వినుకొండలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
  • ఎన్టీఆర్ సర్కిల్ లో భారీ బహిరంగ సభ
  • పోటెత్తిన ప్రజానీకం
  • సీఎం జగన్ పైనా, స్థానిక ఎమ్మెల్యే బొల్లా పైనా లోకేశ్ విమర్శలు
Nara Lokesh speech in Vinukonda

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రతో వినుకొండ పట్టణం జనసంద్రంగా మారింది. 173వ రోజు యువగళం పాదయాత్ర గుర్రపునాయుడుపాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. 

మధ్యాహ్నం భోజన విరామానంతరం వినుకొండలోకి అడుగుపెట్టగా, లోకేశ్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన జనంతో రోడ్లన్నీ కిటకిటలాడాయి. వేలసంఖ్యలో జనం రోడ్లపైకి రావడంతో అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. వినుకొండ ఎన్టీఆర్ సర్కిల్ లో లోకేశ్ నిర్వహించిన బహిరంగసభకు జనం పోటెత్తారు.

వినుకొండ సభలో లోకేశ్ ప్రసంగం హైలైట్స్...


వినుకొండ గడ్డపై పాదయాత్ర నా అదృష్టం

పౌరుషాల గడ్డ పల్నాడు. శ్రీరాముడు అడుగుపెట్టిన పుణ్యభూమి వినుకొండ. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, జామియా మసీదు ఉన్న నేల వినుకొండ. గొప్ప కవి గుర్రం జాషువా జన్మించిన గడ్డ వినుకొండ. ఎంతో ఘన చరిత్ర ఉన్న వినుకొండ నేలపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

వరద బాధితుల వద్దకు వెళ్లే తీరికలేదా?

జగన్ కి పేదలంటే కోపం. నేను ముందే చెప్పా... జరగబోయేది పేదలకు, దోపిడీదార్లకు మధ్య యుద్ధం అని. ఇప్పుడు అదే నిజం అయ్యింది. గోదావరి వరదలు వచ్చి పేద ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే జగన్ ప్యాలస్ లో పడుకున్నాడు. వరదల్లో చిక్కుకున్న వారిని కనీసం పరామర్శించడానికి ఆయనకి మనస్సు రాలేదు. వేరే పనులకు ఆయనకు టైం ఉంది. కానీ, వరద మీద సమీక్ష చెయ్యడానికి టైం లేదు. బాధితుల్ని పరామర్శించడానికి టైం లేదు. 

వరద తగ్గాక నిత్యావసర సరుకులు ఇస్తాం అంటోంది ఈ సైకో ప్రభుత్వం. అప్పటి వరకూ పేద ప్రజలు ఏం తినాలి? ఇళ్ళన్నీ నీట్లో మునిగిపోయాయి. సైకో జగన్ పునరావాస కేంద్రాల్లో పాచిపోయిన అన్నం పెడుతున్నాడు. కుళ్లిపోయిన కూరగాయలు, రెండు ఇళ్లకు ఒక క్యాబేజ్ ఇచ్చాడంట. 

ప్రజలు బాధల్లో ఉంటే చూసి నవ్వుకునే సైకో మనస్తత్వం జగన్ ది. అదే చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు వరద వస్తే అధికారుల కంటే ముందు ఆయనే అక్కడ ఉండి ఆదుకునే వారు. పేదలపై ప్రేమ అంటే అది.

అడ్డుకుంటే వైసీపీకి అంతిమయాత్రే!

జగన్ ని చూస్తే నాకు జాలేస్తోంది. యువగళాన్ని ఆపడానికి సైకో జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పోలీసుల్ని పంపాడు... మనం తగ్గేదే లేదు అన్నాం. మైక్ వెహికల్ లాక్కున్నాడు... ఇది స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారి గొంతు.... ఈ గొంతు నొక్కే మగాడు పుట్టలేదు అని చాలెంజ్ చేశాం. మధ్యలో ఫ్లెక్సీలు పెట్టాడు... మన వాళ్లు చించేశారు. వాళ్లు గుడ్లు వేశారు... మన వాళ్లు ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. 

వినుకొండలో ఫైరింగ్ వరకూ వచ్చింది. బాంబులకే భయపడం... బుల్లెట్లకు భయపడతామా? భయం మా బ్లడ్ లో లేదు సైకో జగన్. వైసీపీ సిల్లీ ఫెల్లోస్ కి మరోసారి చెబుతున్నా. చిల్లర వేషాలు వద్దు. సాగనిస్తే పాదయాత్ర... అడ్డుకుంటే వైసీపీకి అంతిమయాత్ర.

వినుకొండను అభివృద్ధి చేసింది టీడీపీనే!

వినుకొండ నియోజకవర్గాన్ని రూ.2,400 కోట్లతో అభివృద్ధి చేసింది టీడీపీ. పల్నాడు ముద్దుబిడ్డ జీవీ ఆంజనేయులు నేను మంత్రిగా ఉన్నప్పుడు నాతో నిధుల కోసం పోరాడేవారు. తాగు, సాగు నీటి ప్రాజెక్టులు, పేదలకు ఇళ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు, బ్రిడ్జిలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. 

వినుకొండని అభివృద్ధి చేస్తారని మీరు భారీ మెజారిటీతో బొల్లా బ్రహ్మనాయుడుని గెలిపించారు. కానీ, ఆయన వినుకొండకి పొడిచింది ఏంటి? 4 ఏళ్ల క్రితం వినుకొండ ఎక్కడ ఉందో ఇప్పుడూ అక్కడే ఉంది. టీడీపీ హయాంలో ప్రారంభించిన పనులకు రిబ్బన్ కట్టింగ్ చేస్తున్నాడు.

కబ్జాలరాయుడు ఎమ్మెల్యే బొల్లా

ఎమ్మెల్యే ఇంటి పేరు బొల్లా... చెప్పే మాట‌లన్నీ డొల్ల‌. ఎమ్మెల్యే పేరు బ్రహ్మనాయుడు కాదు... క‌బ్జాలరాయుడు. వినుకొండలో మైనార్టీ సోదరుడు ఫరీద్ కుటుంబానికి చెందిన సర్వే నంబర్ 214లో మూడు ఎకరాల భూమిని కబ్జా చేశాడు. తెల్లపాడులో వైశ్య సామాజికవర్గానికి చెందిన శ్రీనుకి చెందిన ఎనిమిది ఎకరాల భూమిని కబ్జా చేశాడు. వెంకుపాలెం వద్ద డైరీకి రోడ్డు వేసుకోవడానికి దళిత మహిళలకు చెందిన 1.50 ఎకరాల భూమిని కబ్జా చేశాడు.

ప్రభుత్వ భూమిని ఆక్రమించి సెంటు స్థలాల పేరుతో మ‌ళ్లీ ప్రభుత్వానికే రూ.20 కోట్లకి అమ్మేశాడు. బ్రాహ్మణపల్లి రెవెన్యూ ప‌రిధిలో 170 ఎకరాల ప్రభుత్వ భూములను కాజేశాడు. పసుపులేరు బ్రిడ్జి వద్ద 62 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించాడు.

వినుకొండలో బి ట్యాక్స్ బెడద

గుండ్లకమ్మ నది, వాగుల నుండి ఇసుక దోపిడి చేస్తున్నాడు. ప్రభుత్వ భూములు, చెరువుల్లో మ‌ట్టినీ దోచేస్తున్నాడు. క‌బ్జాల రాయుడు క‌నుస‌న్నల్లోనే బియ్యం, మద్యం, గుట్కా మాఫియాలు న‌డుస్తున్నాయి. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్న ఎమ్మెల్యేకి "బీ "టాక్స్ చెల్లించాల్సిందే. 

బొల్లాపల్లి మండలంలో రెవెన్యూ రికార్డులు తారుమారు చేయించి 13 వేల ఎకరాలకు 8 వేల పాస్ బుక్‌లు ఇప్పించి 100 కోట్లు దోచేశాడు ఈ ఎమ్మెల్యే. ఈ క‌బ్జారాయుడుని ఓడించ‌క‌పోతే... వినుకొండ‌లో ఎవరి భూమీ మిగ‌ల‌దు. కొండ‌లు మింగేస్తాడు... మ‌ట్టి, ఇసుక కూడా మాయం చేసేస్తాడు.

జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

జగన్ వినుకొండకి అనేక హామీలు ఇచ్చాడు. వరికపూడిసెల ప్రాజెక్టు నిర్మించి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తా అన్నాడు. వినుకొండలో మైనార్టీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తానని అన్నాడు. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తా అన్నాడు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. 

వినుకొండ సమస్యల గురించి అడిగే దమ్ము కబ్జాల రాయుడుకి లేదు. 2024 లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం. వినుకొండలో భారీ మెజారిటీతో టీడీపీని గెలిపించండి. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాం.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2299.6 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 16.1 కి.మీ.*

*174వ రోజు (3-8-2023) యువగళం వివరాలు*

*వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం ( ఉమ్మడి గుంటూరు జిల్లా)*

ఉదయం

8.00 – నగరాయపాలెం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

9.00 – కొండ్రముట్లలో పాదయాత్ర 2300 కి.మీ.లకు చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.

10.00 – సత్యనారాయణపురంలో స్థానికులతో సమావేశం.

11.00 – కొచ్చెర్లలో స్థానికులతో సమావేశం.

మధ్యాహ్నం

1.00 – అంగలూరులో స్థానికులతో సమావేశం.

2.00 – వనికుంటలో స్థానికులతో సమావేశం.

2.15 – వనికుంట శివారు విడిది కేంద్రంలో బస.

******

More Telugu News