Chandrababu: జగన్ సొంత గ్రామంలో చంద్రబాబుకు ఘన స్వాగతం

Gran welcome to Chandrababu Naidu in YS Jagan village
  • పులివెందులలోను చంద్రబాబుకు భారీ గజమాలతో స్వాగతం
  • సింహాద్రిపురంలోని బీటెక్ రవి ఇంటికి వెళ్లిన అధినేత
  • అంతకుముందు గండికోట ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల పరిశీలన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వగ్రామం బలపనూరులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఘన స్వాగతం లభించింది. ఇక్కడి చినీ రైతులు ఆయనకు గజమాలతో ఘన స్వాగతం పలికారు. పులివెందులలోను చంద్రబాబుకు భారీ గజమాలతో స్వాగతం పలికారు. అంతకుముందు, కడప జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గండికోట సీబీఆర్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను టీడీపీ అధినేత పరిశీలించారు. ఈ పర్యటన సందర్భంగా సింహాద్రిపురంలో పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి ఇంటికి అధినేత వెళ్లారు.

గండికోట రిజర్వాయర్‌ను సందర్శించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేని సీఎం జగన్.. కొత్త ప్రాజెక్టుల పేరుతో మరో దోపిడీకి తెరలేపారన్నారు. కొత్తగా పది ప్రాజెక్టులంటూ రూ.12వేల కోట్ల దోపిడీకి సిద్ధమయ్యారన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తూ మంత్రి పెద్దిరెడ్డికి మాత్రం రూ.600 కోట్ల బిల్లులను సెటిల్ చేశారని చెప్పారు. ఏ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎవరికి పేరు వస్తుందోనని పెండింగ్ ప్రాజెక్టులను వదిలేశారని ఆరోపించారు. నాలుగేళ్లలో జగన్ ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదన్నారు.

తాను ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే ఆ శాఖ మంత్రి అంబటి మాత్రం బ్రో సినిమా గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. సొంత కంపెనీలకు డబ్బులు దోచి పెట్టేందుకు మంత్రులే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారన్నారు. ఆగస్ట్ 2వ తేదీ వచ్చినా శ్రీశైలం మోటార్లు ఇంకా ఆన్ కాలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నాడు గిన్నిస్ రికార్డులు వస్తే ఇప్పుడు విమర్శలే వస్తున్నాయని వ్యాఖ్యానించారు. పోలవరం నిర్వాసితులు వరద ముంపునకు గురైతే కనీసం తిండి పెట్టలేదన్నారు. తాము అధికారంలోకి రాగానే పోలవరం ముంపు మండలాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించి నిర్వాసితులను ఆదుకుంటామన్నారు.
Chandrababu
YS Jagan
Kadapa District
Telugudesam

More Telugu News