KA Paul: అందుకే జేడీ, తోట చంద్రశేఖర్ వంటి వారు పవన్ ను వదిలేశారు: కేఏ పాల్

  • 'పవన్, మాతో కలువు' అంటూ కేఏ పాల్ విజ్ఞప్తి
  • నాలుగేళ్ల నుంచి రమ్మంటున్నా రావడంలేదని పవన్ పై అసంతృప్తి
  • పవన్ కు నిలకడలేదని విమర్శలు
  • తాను రియల్ కాపునంటూ కేఏ పాల్ వ్యాఖ్యలు
KA Paul slams Pawan Kalyan

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తనదైన శైలిలో ఏపీ రాజకీయాలపై స్పందించారు. ప్రజాశాంతి పార్టీతో చేయి కలపాలని నాలుగేళ్ల నుంచి పవన్ కల్యాణ్ ను కోరుతున్నామని, కానీ పవన్ కల్యాణ్ రావడంలేదని విమర్శించారు. తనకు మోదీయే ముద్దు అంటున్నారని వ్యాఖ్యానించారు. కానీ పవన్ ఢిల్లీ వెళితే మోదీ, అమిత్ షా అపాయింట్ మెంటే ఇవ్వరని... తాను ఇప్పుడు ఢిల్లీ వెళ్లినా మోదీ, అమిత్ షా తనను వెంటనే కలుస్తారని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. కానీ వాళ్లు తనకు అవసరం లేదని పేర్కొన్నారు.

"2019లో నాదే తప్పు. ఒకరితో పొత్తులు పెట్టుకుందామని చివరి వరకు ఆగాం. వారు మోసం చేశారు... అమ్ముడుపోయారు. పవన్ కల్యాణ్ కు నిలకడలేదు. పవన్ నిలకడగా ఉంటూ, ప్రజాశాంతి పార్టీతో కలిస్తే జనసేనకు ఓటు బ్యాంకు పెరుగుతుంది. నిలకడ లేకనే, కాపులందరూ ఆయనకు దూరమయ్యారు. 

తోట చంద్రశేఖర్ వంటి రిటైర్డ్ ఐఏఎస్, 'జేడీ' లక్ష్మీనారాయణ వంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, రావెళ్ల కిశోర్ వంటి నేతలు కూడా జనసేనలో చేరి వెంటనే వదిలేశారు. కాపులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు పవన్ ను వదిలేశారు. వీళ్లందరూ ఎందుకు వదిలేశారంటే కారణం ఒక్కటే. మోదీకి పవన్ మద్దతు ఇవ్వడమే. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే మోదీ. 

అందుకే పవన్ ను నాతో కలవమంటున్నాను. నేను రియల్ పెద్ద కాపును, మున్నూరు కాపును... బీసీని. నువ్వు మన బీసీలను, కాపులను తప్పుదోవ పట్టించి మూడ్నాలుగు శాతం ఓట్లను చీల్చవద్దు" అంటూ పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి కేఏ పాల్ వ్యాఖ్యానించారు.

More Telugu News