Ganta Srinivasa Rao: జగన్ చేసిన శంకుస్థాపనల లెక్క చెప్పిన గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasa Rao tweet on YS Jagan government
  • నాలుగున్నరేళ్లలో శంకుస్థాపనలే తప్ప ప్రారంభోత్సవాలు లేవన్న గంటా
  • కొత్త కంపెనీల రాక లేదు.. ఉద్యోగాల్లేవ్, ఆదాయం లేదని విమర్శ
  • జగన్ సీఎం అయ్యాక అప్పు చేయని నెల, ఆర్బీఐ వద్ద సెక్యూరిటీ తాకట్టు పెట్టని మంగళవారం లేదని ఆరోపణ
  • చిన్న ప్రాజెక్టునైనా ప్రారంభించినట్లు ఆధారాలతో చూపించాలని సవాల్
ఈ నాలుగున్నరేళ్లలో ఎప్పుడూ శంకుస్థాపనలే తప్ప ఒక్క ప్రారంభోత్సవమైనా చేశారా? జగన్మోహన్ రెడ్డిగారూ... అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. 

'ఎప్పుడూ శంకుస్థాపనలే కానీ ఈ నాలుగున్నరేళ్లలో ఏ ఒక్క ప్రారంభోత్సవమైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు....?
ఈ నాలుగున్నారేళ్లలో కొత్తగా వచ్చిన కంపెనీ ఒక్కటీ లేదు...
ఒప్పందం చేసుకున్న కంపెనీలు రివర్స్ పాలనతో పక్క రాష్ట్రాలకి వలస వెళ్లి పోయాయ్.. 
ఇక ఉద్యోగాలేమొస్తాయ్ ...
ఆదాయం ఏం వస్తుంది.....
అయినా ఏముందిలే అప్పులు చేసి బ్రతికేయగలరూ కదా...!
మీరు ముఖ్యమంత్రి అయ్యాక అప్పు చెయ్యని నెల.. ఆర్బీఐ వద్ద సెక్యూరిటీలు తాకట్టు పెట్టని మంగళవారం ఒకటి కూడా లేదు కదా..!

ఎన్నికలు సమీపిస్తుండటంతో చివరి సంవత్సరంలో హడావుడిగా నిన్న విశాఖపట్నంలో ఇనార్బిట్‌ మాల్‌ శంకుస్థాపన దగ్గర నుంచి చూస్తే...
ఈ సంవత్సరం మే 3న  భోగాపురం విమానాశ్రయం, అదానీ డేటా సెంటర్కు శంకుస్థాపన....
ఇదే సంవత్సరం మే 22న మచిలీపట్నం పోర్టు కు శంకుస్థాపన....
ఇదే సంవత్సరం ఫిబ్రవరి 15న కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన.....
గత సంవత్సరం జులై 20న రామాయపట్నం పోర్టు కు శంకుస్థాపన....

ఇలా ప్రతి కార్యక్రమం కూడా శంకుస్థాపన పేరిట ప్రజలను మభ్యపెడుతూ వారిని మోసం చేస్తూనే ఉన్నారు' అని ధ్వజమెత్తారు.

టీడీపీ అధినేత చంద్రబాబు శంకుస్థాపన చేసి... ప్రాజెక్టు పనులు ప్రారంభించిన వాటికి కూడా మీరు రెండోసారి శంకుస్థాపన పేరుతో హడావుడి చేశారని, ఆ రోజు తెచ్చిన పలుగు, పార, తట్ట కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ఈ రోజుకీ మీరు శంకుస్థాపన చేసిన ఏ ఒక్కచోట చిన్న ఇటుక కూడా వెయ్యలేదన్నారు. 

మ‌డ‌మ తిప్ప‌డం.. మాట త‌ప్ప‌డం మా ఇంటావంటా లేద‌ని, విశ్వ‌స‌నీయ‌త అనే పదానికి నేను పేటెంట్ అని చెప్పుకుని తిరుగుతున్నారని జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని సూటిగా అడుగుతున్నానని, మీకు నిజంగా చిత్తశుద్ధి కానీ దైర్యం కానీ ఉంటే మీరు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నారేళ్లలో ఏ ఒక్క చిన్న ప్రాజెక్టైనా పూర్తి చేసి ప్రారంభించామని మీరు.. మీ నాయకులు నిర్భయంగా ఆధారాలతో ప్రజలకు చూపించగలరా? అని నిలదీశారు.
Ganta Srinivasa Rao
YS Jagan
Andhra Pradesh

More Telugu News