Uttar Pradesh: యూపీలో మరో దారుణం.. బాలికను వేధించి శానిటైజర్ తాగించిన యువకులు.. బాలిక మృతి

Teen girl dies after being forced to drink sanitiser for resisting molestation bid
  • స్కూలు నుంచి వస్తున్న బాలికను అడ్డుకుని వేధింపులు
  • అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆమె సోదరుడిపైనా దాడి
  • మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వైనం
ఉత్తరప్రదేశ్‌లో దారుణాలకు అడ్డుకట్ట పడడం లేదు. వరుస ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా కొందరు యువకులు ఓ బాలికను వేధించి ఆమె ప్రాణాలు తీశారు. బరేలీకి చెందిన 16 ఏళ్ల విద్యార్థిని గత నెల 27న స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో మఠ్ లక్ష్మీపూర్ ప్రాంతానికి చెందిన ఉదేశ్ రాథోడ్ (21) అడ్డుకుని వేధించాడు. ఆ తర్వాత మరో ముగ్గురు స్నేహితులు అతడికి తోడయ్యారు. నలుగురూ కలిసి బాలికను వేధించడం మొదలుపెట్టారు.

అదే సమయంలో అటువైపుగా వస్తున్న బాలిక సోదరుడు చూసి అడ్డుకునే ప్రయత్నం చేయగా, అతడిపై దాడిచేశారు. ఆ తర్వాత  బాలికతో బలవంతంగా శానిటైజర్ తాగించారు. ఈ మొత్తం ఘటనను వారు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. శానిటైజర్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందింది. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Uttar Pradesh
Sanitiser
Molestation
Crime News

More Telugu News