Supreme Court: కోర్టు ధిక్కార కేసులో వైద్యుడి లైసెన్స్ రద్దు చేసిన హైకోర్టు.. సుప్రీంకోర్టు ఏమందంటే..!

SC sets aside Calcutta HC order suspending doctors licence in contempt proceedings
  • ధిక్కార కేసుల విచారణలో భావోద్వేగాలు చూపొద్దన్న అత్యున్నత న్యాయస్థానం
  • వైద్యుడి లైసెన్స్ రద్దు సరికాదంటూ కలకత్తా హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీం  
  • జ్యుడీషియల్ పరిధికి లోబడి మాత్రమే ఆదేశాలివ్వాలని కింది కోర్టులకు సూచన
కోర్టు ధిక్కారానికి పాల్పడిన కేసులో వైద్యుడి లైసెన్స్ ను రద్దు చేయడం సరికాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కింది కోర్టు తీర్పును పక్కనపెడుతూ.. వైద్యుడి లైసెన్స్ రద్దును ఎత్తివేసింది. ఈమేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సంజయ్ కరోల్ ల నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. కోల్ కతా వైద్యుడికి ఊరట కలిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా కింది కోర్టులకు కీలక సూచనలు చేసింది. కోర్టు ధిక్కార కేసులను విచారించేటపుడు భావోద్వేగాలకు లోనుకావొద్దని, వ్యక్తిగత ఎమోషన్స్ ప్రభావంతో తీర్పు వెలువరించ వద్దని పేర్కొంది. జ్యుడీషియల్ పరిధులకు లోబడి, న్యాయానికి కట్టుబడి తీర్పులివ్వాలని సూచించింది.

కేసు వివరాలివీ..
కోల్ కతా కు చెందిన ఓ వైద్యుడి నిర్మాణం అక్రమమని కోర్టు తేల్చింది. దానిని వెంటనే కూల్చేయాలని వైద్యుడిని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణంలో కొంత భాగం మినహా మిగతాదంతా కూల్చేశారు. మిగిలిన భాగాన్ని కూల్చితే దానికి ఆనుకుని ఉన్న ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని వైద్యుడు కోర్టుకు వివరించారు. అయితే, తమ ఆదేశాలను పూర్తిగా అమలు చేయలేదని కలకత్తా హైకోర్టు వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ధిక్కారమేనని తేల్చి, జరిమానాగా వైద్యుడి లైసెన్స్ ను రద్దు చేసింది. ఈ తీర్పుపై వైద్యుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసు విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. వైద్యుడి లైసెన్స్ రద్దును ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Supreme Court
calcutta court
doctor licence
contempt

More Telugu News