Gurukula: ఒక్కో పరీక్ష ఒక్కో జిల్లాలో.. గురుకుల టీజీటీ పరీక్ష రాసేదెలా?

Gurukula teacher candidates worried about allotment of examination centers
  • గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అయోమయం
  • ఒక పరీక్ష ఓ జిల్లాలో రాసి తెల్లారి మరో జిల్లాకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి
  • మూడు పరీక్షలూ ఒకే కేంద్రంలో నిర్వహించాలని అభ్యర్థుల విజ్ఞప్తి
గురుకులాల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన ఆన్ లైన్ పరీక్షలు ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటికే హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. ఇందులో గురుకులాల్లో టీజీటీ పోస్టులకు దాదాపు లక్ష మంది దరఖాస్తు చేశారు. వారందరూ తమ హాల్ టికెట్లు చూసి అధికారుల తీరుపై మండిపడుతున్నారు. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 గా మూడు పరీక్షలు ఆన్ లైన్ లో రాయాల్సి ఉండగా.. అధికారులు ఒక్కో పరీక్షకు ఒక్కో కేంద్రం కేటాయించారు. అదీ ఒక్కోటీ ఒక్కో జిల్లాలో ఉండడంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక జిల్లా కేంద్రంలో పరీక్ష రాసి ఆ మరుసటి రోజు వందల కిలోమీటర్ల దూరంలోని మరో జిల్లా కేంద్రానికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని అభ్యర్థులు వాపోతున్నారు.

మూడు పరీక్షలను ఒకే కేంద్రంలో రాసేలా చర్యలు తీసుకోవాలని నియామక బోర్డుకు టీజీటీ అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, వేర్వేరు జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడంపై గురుకుల నియామక బోర్డు తాజాగా వివరణ ఇచ్చింది. పరీక్షలన్నీ ఆన్ లైన్ లో నిర్వహించడం వల్లే ఈ సమస్య ఎదురైందని అధికారులు చెప్పారు. జిల్లాలో అందుబాటులో ఉన్న స్లాట్ల కన్నా అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల పక్క జిల్లాలోని కేంద్రాన్ని అలాట్ చేయాల్సి వచ్చిందని వివరించారు. ఇలా దాదాపు 1600 మందికి వేర్వేరు పరీక్షా కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు. గురుకుల పరీక్షలు వాయిదా వేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, షెడ్యూలు ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని గురుకుల నియామకపు బోర్డు వివరించింది.
Gurukula
TGT
Online Exam
different centers
candidates

More Telugu News