Antonio Guterres: భూమండలం అధిక వేడిమితో ఉడికిపోయే రోజులు వచ్చాయి: ఐరాస చీఫ్ గుటెర్రాస్

UN Chief Antonio Guterres express concerns over severe heat waves raise worldwide
  • గణనీయంగా పెరిగిన ప్రపంచవ్యాప్త సగటు ఉష్ణోగ్రతలు
  • యూరప్ దేశాల్లో మండిపోతున్న ఎండలు
  • వాతావరణ మార్పులపై ఆందోళన వ్యక్తం చేసిన ఆంటోనియో గుటెర్రాస్
  • ఈ వేసవి క్రూరంగా ఉందంటూ వ్యాఖ్యలు 
  • కర్బన ఉద్గారాల తగ్గింపునకు నడుంబిగించాలని పిలుపు

ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. భారత్ లో ఈ వేసవిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కు పైన నమోదవడం తెలిసిందే. 

అటు, శీతల ప్రాంతాలుగా పేరుగాంచిన యూరప్ దేశాలు ఎండవేడిమితో అల్లాడిపోతున్నాయి. అమెరికా, కెనడా దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. కార్చిచ్చులు సైతం ఏర్పడి తీవ్ర నష్టం కలుగుజేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జులై మాసంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సగటు ఉష్ణోగ్రతలు చూస్తే ఈ భూగోళం అధిక వేడిమితో ఉడికిపోయే కాలం వచ్చినట్టు అనిపిస్తోందని అన్నారు. వాతావరణ మార్పులపై ఎంత వేగంగా స్పందించి చర్యలు తీసుకుంటే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. 

ఈ ఏడాది ఉత్తరార్థగోళంలో వేడిమి విపరీతంగా పెరిగిపోయిందని, తద్వారా ఈ వేసవి ప్రజల పట్ల భయానకంగా మారిందని గుటెర్రాస్ వివరించారు. 

"వాతావరణం మారిపోతోంది. రాబోయే రోజులు భయానకంగా ఉండనున్నాయి. ఇది ప్రారంభం మాత్రమే. భూమండలం వేడెక్కడం ముగిసింది... ఇప్పుడు ఆ వేడితో భూమండలం ఉడికిపోవడం మొదలైంది. ఈ గణనీయమైన మార్పు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. అంచనాలు, పదేపదే చేసిన హెచ్చరికలు ఏవీ ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. 

ఇకనైనా మరోసారి శిలాజ ఇంధనాల వినియోగం కట్టడిపై దృష్టి సారిద్దాం. ఈ గాలి పీల్చడానికి ఏమైనా అనుకూలంగా ఉందా? ఈ వేడిమిని మనం భరించగలమా? వాతావరణ మార్పులను పట్టించుకోకుండా, తీవ్రస్థాయిలో శిలాజ ఇంధన వినియోగం జరుగుతోందనడానికి ఆ రంగం లాభాలే నిదర్శనం. ఈ తరహా విధానాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. 

ప్రపంచ నేతలు ఇప్పటికైనా ముందుకు కదిలి వాతావరణ మార్పులపై చొరవ తీసుకోవాలి. ఎంతమాత్రం ఉపేక్షించడానికి, సాకులు చెప్పడానికి ఇది సమయం కాదు. లేకపోతే, ఇంకెవరో ముందుకు వస్తారని ఎదురుచూస్తూ కాలం గడిపేందుకు ఇది అంతకన్నా తరుణం కాదు" అని స్పష్టం చేశారు. 

అంతేకాదు, 2040 నాటికి కర్బన ఉద్గారాల తటస్థతను సాధించాలన్న తీర్మానానికి అభివృద్ధి చెందిన దేశాలు కట్టుబడి ఉండాలని గుటెర్రాస్ పిలుపునిచ్చారు. ఇదే లక్ష్యాన్ని వర్ధమాన దేశాలు 2050 నాటికి నెరవేర్చేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

  • Loading...

More Telugu News