World Cup 2023: భారత్‌–పాక్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్న బీసీసీఐ

 BCCI set to discuss India vs Pakistan date change in World Cup 2023
  • మ్యాచ్‌ షెడ్యూల్‌ మార్చే యోచనలో బోర్డు
  • ముందుగా అక్టోబర్‌‌ 15న అహ్మదాబాద్‌లో షెడ్యూల్‌
  • ఒక రోజు ముందుగానే మ్యాచ్‌ జరిగే అవకాశం
భారత్ ఆతిథ్యం ఇచ్చే వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్‌లో కీలక మార్పు జరగనుంది. ఈ టోర్నీకే హైలైట్‌ గా నిలవనున్న భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌ ను ఒక రోజు ముందుకు జరపాలని బీసీసీఐ భావిస్తోంది. గత నెలలో విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఈ మ్యాచ్‌ను అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి కేటాయించారు. 

అయితే, అదే రోజు నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. దాంతో, అటు ఆ ఉత్సవాలకు ఇటు లక్ష పైచిలుకు అభిమానులు వచ్చే ఈ మ్యాచ్‌కు భద్రత కల్పించడం కష్టమని స్థానిక పోలీసులు బీసీసీఐకి తెలిపారు. దాంతో, మ్యాచ్‌ ను ఒక రోజు ముందుకు అంటే అక్టోబర్ 14న నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. ఇదే విషయాన్ని ప్రపంచ కప్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్ర సంఘాలతో ఈ రోజు ఢిల్లీలో జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. 

హోటల్స్ ఫుల్..

  భారత్–పాక్‌ మ్యాచ్‌ను ప్రత్యక్ష్యంగా చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో, అహ్మదాబాద్‌లో హోటల్‌ గదుల రేట్లు ఆకాశాన్ని అంటాయి. హోటల్స్‌ నిండిపోవడంతో హాస్పిటల్‌లో బెడ్స్‌ బుక్‌ చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మ్యాచ్‌ తేదీలో మార్పులు జరిగితే అభిమానులకు మరిన్ని ఇబ్బందులు కలగనున్నాయి. 

మరోపక్క, భారత్, పాక్‌ మ్యాచ్ అక్టోబర్‌ 14న నిర్వహిస్తే టోర్నీ ఓవరాల్‌ షెడ్యూల్‌లోనూ మార్పులు జరిగే చాన్సుంది. అక్టోబర్‌ 14న ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఇక, భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 8న చెన్నైలో అడనుండగా.. పాక్‌ హైదరాబాద్‌లో అదే నెల 6, 12న నెదర్లాండ్స్‌, శ్రీలంకతో పోటీ పడనుంది. ఇండో–పాక్‌ మ్యాచ్‌ ఒక రోజు ముందుకు జరిగితే దీనికి సన్నద్ధం అయ్యేందుకు పాక్‌ జట్టుకు ఒకే రోజు సమయం ఉండనుంది. దీనికి పాక్ ఒప్పుకుంటుందో లేదో చూడాలి.
World Cup 2023
Team India
Pakistan
match
date
change

More Telugu News