Akbar Momin: హనుమంతుడు.. నీటిలో చూస్తే రాముడు, ఇటు మోదీ.. అద్దంలో చూస్తే అమిత్ షా.. అబ్బురపరుస్తున్న త్రీడీ పెయింటింగ్స్..

Akbar Momin 3D paintings of ModiShah Ram Hanuman have made him a celebrity
  • అబ్బురపరుస్తున్న అక్బర్ మోమిన్ చిత్రకళ
  • ప్రపంచవ్యాప్తంగా రాత్రీపగలు తేడా లేకుండా ఫోన్లు చేస్తూ అభినందనలు
  • ఒక్క రోజులో 25 మిలియన్ వ్యూస్
  • ఓ ఫొటోకు మిలియన్ డాలర్ల ఆఫర్ వచ్చినా తిరస్కరణ

దేశంలో అద్భుతమైన కళాకారులు ఉన్నారని, వారు అనితర సాధ్యమైన చిత్రాలను సృష్టించగలరని చెప్పేందుకు గుజరాత్‌కు చెందిన అక్బర్ మోమిన్ ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన గీసిన త్రీడీ చిత్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. హనుమతుడు, నరేంద్రమోదీ చిత్రాలు అక్బర్‌ను సెలబ్రిటీని చేశాయి. సోషల్ మీడియాలో వీటిని చూసిన వారు ఆయన కళకు అచ్చెరువొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా తనకు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, రాత్రీపగలు తేడాలేకుండా ఫోన్లు చేస్తూ తనను అభినందిస్తున్నారని ఆయన తెలిపారు. ఫోన్ చేస్తున్న వారిలో హిందూముస్లింలు కూడా ఉన్నారని 69 ఏళ్ల అక్బర్ తెలిపారు.  

ఆయన వేసిన పెయింటిగ్స్‌లో అంత గొప్పతనం ఏముందనేగా మీ అనుమానం. హనుమంతుడు, ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటాలను ఆయన గీశారు. చాలా చక్కగా జీవకళ ఉట్టిపడేలా వాటిని చిత్రీకరించారు. ఇందులో చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అయితే, ఇక్కడే అసలు మ్యాజిక్ దాగి వుంది. హనుమాన్ చిత్రపటాన్ని నీటికి దగ్గరగా ఉంచినప్పుడు దాని ప్రతిబింబం శ్రీరాముడిలా దర్శనమిస్తుంది. అలాగే, మోదీ చిత్రపటాన్ని అద్దానికి దగ్గరగా తీసుకెళ్తే అందులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గంభీరంగా కనిపిస్తారు. 

   సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పెయింటింగ్స్‌ను చూసిన నెటిజన్ల ఆశ్చర్యానికి అంతేలేకుండా పోతోంది. అదెలా సాధ్యమంటూ బుర్రలు బద్దలుగొట్టుకుంటున్నారు. వాటిని తిరగేసి చూసినా, కాదు..కాదు.. ఏవైపు నుంచి చూసినా రెండో చిత్రం కనిపించడం లేదు. కానీ నీటికి దగ్గరగా తీసుకెళ్తే మాత్రం అందులో దాగున్న రెండో ఫొటో కనిపిస్తోంది. ఏంటీ మాయా.. మర్మం అని చర్చించుకుంటున్నారు. కేవలం 24 గంటల్లోనే అక్బర్ 3డీ పెయింటింగ్స్‌కు 25 మిలియన్ వ్యూస్ లభించాయి. 

తానో సాధారణ పెయింటర్‌ని మాత్రమేనని అక్బర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఆర్టిస్ట్‌గా తనలోని కళను ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతోనే తాను మోదీ, రాముడి చిత్రాలను ఎంచుకున్నట్టు తెలిపారు. ఇండియాలో ఇప్పటి వరకు ఎవరూ వేయని పెయింటింగ్స్ వేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పదేళ్ల వయసు నుంచే చిత్రకళపై మక్కువ పెంచుకున్నట్టు తెలిపారు. మోదీ, అమిత్ షా గుజరాత్ వచ్చినప్పుడు ఈ పెయింటింగ్స్ వారికి బహూకరిస్తానని తెలిపారు. కాగా, ఇటీవల ఆయన గీసిన ఓ చిత్రానికి మిలియన్ డాలర్ల ఆఫర్ వచ్చినా దానిని తిరస్కరించడం గమనార్హం.  
రాముడి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మోదీ వీడియో కోసం దీనిపై క్లిక్ చేయండి


 

  • Loading...

More Telugu News