New Delhi: ఉప్పొంగిన యుమున ఉపనది.. నోయిడాలో నీటమునిగిన వందలాది కార్లు

Over 200 Cars Submerged In Greater Noida As Hindon Overflows
  • హిండెన్ నది నీటిమట్టం పెరగడంతో పైకప్పు వరకు మునిగిన కార్లు
  • ఎకోటెక్-3 సమీపంలో మునిగిన కార్లు
  • దేశ రాజధాని ప్రాంతంలో నేటి రాత్రి నుండి తేలికపాటి వర్షాలు
దేశంలోని పలుచోట్ల గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి, ఢిల్లీలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. తాజాగా ఓ షాకింగ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. యమునా నది ఉపనది హిండన్ నది నీటి మట్టం పెరగడంతో గ్రేటర్ నోయిడాలోని ఓ మైదానంలో 400కు పైగా కార్లు పైకప్పుల వరకు మునిగిపోయాయి. గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్-3 సమీపంలో కార్లు మునిగిన వీడియో ఇది. ఆ కార్ల పైకప్పులు కేవలం ఒక అంగుళం మాత్రమే బయటకు కనిపిస్తున్నాయి. అన్ని కార్లు కూడా దాదాపు తెల్లవే.

హిండన్ నది నీటిమట్టం పెరగడంతో శనివారం నదికి సమీపంలోని వారిని ఇళ్ల నుండి ఖాళీ చేయించారు. ప్రభావిత ప్రాంతాల్లో నోయిడా సెక్టార్ 63లోని ఎకోటెక్, ఛిజార్సీ ఉన్నాయి. నోయిడా, జాతీయ రాజధాని ప్రాంతంలోని ఇతర ప్రాంతాలలో నేడు తెల్లవారుజామున తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. ఈరోజు మధ్యాహ్న సమయానికి యమునా నది ప్రమాదకరస్థాయి 205.33 మీటర్ల ఎగువన ప్రవహిస్తోంది. మధ్యాహ్నం 205.4 మీటర్ల స్థాయికి చేరుకుంది.

ఢిల్లీలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చు. ఢిల్లీకి ఎలాంటి భారీ వర్షాల హెచ్చరిక లేదు. కానీ జులై 25 రాత్రి నుండి తేలికపాటి వర్షాలు ఉంటాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్త వెల్లడించారు. మహారాష్ట్ర, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సౌరాష్ట్ర-కచ్ ప్రాంతం, మధ్య మహారాష్ట్ర, గోవా, కోస్తా కర్ణాటకలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. గుజరాత్‌లో గత 24 గంటల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.
New Delhi
heavy rain

More Telugu News