Daggubati Purandeswari: ఏపీ రాజధానిగా అమరావతికి కేంద్రం కట్టుబడి ఉంది: పురందేశ్వరి

ap bjp chief purandeswari says bjp stand is aamravati is the capital of andhra pradesh
  • ఏపీ అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్న పురందేశ్వరి
  • రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడం లేదని వ్యాఖ్య
  • ఏపీకి కేంద్రం ఏం చేయడం లేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • పొత్తులపై అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఏపీకి కేంద్రం ఏం చేయడం లేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రానికి కేంద్రం అత్యధిక ఇళ్లను కేటాయించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని పురందేశ్వరి చెప్పారు. పొత్తులపై అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, పార్టీని ముందుకు నడిపే బాధ్యత తమముందు ఉందని చెప్పారు. దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసిందని స్పష్టం చేశారు. తమకు అనుకూలమైనవారి పేర్లతో దొంగ ఓట్లు సృష్టించి ఎన్నికల్లో గెలవాలని చూడటం దుర్మార్గమని అన్నారు.

‘‘సీఎం జగన్ పదే పదే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని వారిని సొంతం చేసుకునే భావనతో మాట్లాడుతున్నారు. మరి వారికి ఏం న్యాయం  చేశారు? ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు జరుగుతుంటే సీఎం జగన్ ఏం చేశారు? తాడేపల్లి‌లో సీఎం ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో ఎస్సీ మహిళపై అత్యాచారం జరిగితే.. ఆమెకు న్యాయం చేయలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది” అని మండిపడ్డారు.

అమరావతిలోని ఆర్-5 జోన్‌లో పేదల ఇళ్లకు నిర్మాణం అనే అంశం కోర్టులో ఉందని పురందేశ్వరి చెప్పారు. ‘మేము పేదలు, అమరావతి రైతుల ఇద్దరి పక్షం. పేదలకు ఇళ్లు ఇవ్వొద్దని మేము ఎక్కడా చెప్పలేదు. అక్కడ నిర్మాణమయ్యే ఇళ్లకు కూడా ప్రతి ఇంటికి రూ.1.8 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందనే విషయాన్ని గమనించాలి” అని గుర్తు చేశారు.
Daggubati Purandeswari
ap bjp chief
Amaravati
capital of AP
YSRCP

More Telugu News