PM Kisan: ఈ నెల 27న రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు

PM Kisan Yojana 14th installment to be released on this date
  • రాజస్థాన్ లోని సికార్ లో నిధులు విడుదల చేయనున్న మోదీ
  • రైతుల ఖాతాల్లో ఏటా రూ.6 వేలు జమ చేస్తున్న కేంద్రం
  • ఇప్పటి వరకు 13 విడతల నగదు విడుదల

దేశంలోని రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు తీసుకొచ్చిన పీఎం కిసాన్ యోజన పథకం నిధులను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 13 విడతలుగా రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం నగదు జమ చేసింది. తాజాగా 14వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ 27న జమ చేయనున్నారు. రాజస్థాన్ లోని సికార్ లో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొని, రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారని ఉన్నతాధికారులు వెల్లడించారు.

పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏటా రూ.6 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా (రూ.2 వేల చొప్పున) రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. ఈ పథకం కింద సుమారు 8.5 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరుతోందని అధికారులు తెలిపారు. కాగా, ఈ పథకానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నెంబర్ 155261 లేదా 1800115526 లేదా 011-23381092 నెంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

  • Loading...

More Telugu News