Team India: వైట్‌వాష్ కాకుండా విండీస్‌ను కాపాడిన వర్షం.. భారత్‌దే సిరీస్

  • ఐదో రోజు ఆటను తుడిచిపెట్టేసిన వాన
  • భారత్ క్లీన్‌స్వీప్ ఆశలపై నీళ్లు
  • 1-0తో సిరీస్ కైవసం
  • 27 నుంచి వన్డే  సిరీస్ మొదలు
India Clinch Two Match Test Series Against West Indies

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు ఐదో రోజు ఆటను వరుణుడు అడ్డుకోవడంతో క్లీన్ స్వీప్ చేయాలన్న టీమిండియా ఆశలు అడియాశలయ్యాయి. వర్షం కారణంగా చివరి రోజు ఆట రద్దు కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో రెండో టెస్టు సిరీస్‌ను భారత్ 1-0తో సరిపెట్టుకుంది. నాలుగో రోజే ఆటకు అడ్డుపడిన వర్షం దాదాపు ఒక సెషన్ మొత్తాన్ని అడ్డుకుంది. ఐదో రోజైనా కరుణిస్తాడని వేచి చూసినా ఫలితం లేకుండా పోయింది. ఆగుతూ సాగుతూ ఆటకు పూర్తిగా అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

365 పరుగుల విజయ లక్ష్యంతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ 28 పరుగులు చేయగా, మెకంజీ డకౌట్ అయ్యాడు. చందర్‌పాల్ 24, బ్లాక్‌వుడ్ 20 పరుగులతో క్రీజులోని వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. నిన్న కనుక మ్యాచ్ కనీసం రెండు సెషన్లు సాగినా విజయం భారత్ సొంతమయ్యేదే. అయితే, వాన అడ్డుపడి విండీస్‌ను వైట్‌వాష్ కాకుండా రక్షించింది. ఇక ఈ మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ నెల 27 నుంచి భారత్-విండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.

More Telugu News