tipu sultan: బెదిరింపుల నేపథ్యంలో.. టిప్పు సుల్తాన్ సినిమా తీయడం లేదని ప్రకటించిన నిర్మాత

Tipu Sultan film shelved amidst pressure from his followers
  • హజ్రత్ టిప్పు సుల్తాన్ పేరుతో సినిమా తీస్తామని గతంలో ప్రకటించిన సందీప్ సింగ్ 
  • ఇప్పుడు సినిమాను తీయడం లేదని ట్విట్టర్ ద్వారా వెల్లడి
  • కుటుంబ సభ్యులకు, స్నేహితులకు బెదిరింపులు రావడమే కారణమని వ్యాఖ్య 
టిప్పు సుల్తాన్‌పై సినిమాను నిలిపివేస్తున్నట్లు నిర్మాత సందీప్ సింగ్ సోమవారం ప్రకటించారు. టిప్పు అభిమానుల నుండి తనకు, తన కుటుంబానికి, స్నేహితులకు బెదిరింపులు రావడమే ఇందుకు కారణమని చెప్పారు. టిప్పు సల్తాన్ సినిమాను నిలిపివేస్తున్నట్లు సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

'హజ్రత్ టిప్పు సుల్తాన్‌పై సినిమా తీయడం లేదు. నన్ను, నా కుటుంబాన్ని, నా స్నేహితులను బెదిరించడం లేదా దుర్భాషలాడడం ఇప్పటికైనా మానుకోవాలని నా తోటి సోదరీ, సోదరీమణులను కోరుతున్నాను. నేను ఉద్దేశపూర్వకంగా ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీసి ఉంటే నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను' అని ఆయన ట్వీట్ చేశారు. అన్ని విశ్వాసాలను తాను దృఢంగా విశ్వసిస్తానని, భారతీయులుగా మనం ఎప్పటికీ ఒకరినొకరం గౌరవించుకుంటూ ఐక్యంగా ఉందామని పేర్కొన్నారు. 

హజ్రత్ టిప్పు సుల్తాన్ సినిమాను సందీప్, ఈరోస్ ఇంటర్నేషనల్, రష్మీ శర్మ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాల్సి ఉంది. హిందీ, కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించారు. మేలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ చిత్రాన్ని ప్రకటించారు.

సినిమా ప్రకటించిన సమయంలో, టిప్పు సుల్తాన్ గురించి వాస్తవం తెలుసుకొని తాను షాకయ్యానని సందీప్ చెప్పారు. తన సినిమాలు ఎప్పుడూ సత్యం వైపు నిలబడతాయన్నారు. చరిత్ర పుస్తకాల ద్వారా ఆయనను ఒక గొప్ప వీరుడిగా చిత్రీకరించి మన బ్రెయిన్ వాష్ చేశారని, కానీ టిప్పు గురించి ఎవరికీ తెలియని క్రూరమైన మరో పార్శ్వాన్ని తాము చూపించబోతున్నామన్నారు. భవిష్యత్తు తరాల కోసం చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తామని అప్పుడు చెప్పారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా ఈ సినిమాను తీయడం లేదని ప్రకటించారు.
tipu sultan
producer
cinema

More Telugu News