Gurvinder Nath: కెనడాలో దారుణం... గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో భారతీయ విద్యార్థి మృతి

Indian student dies in Canada as unidentified persons attacked him
  • ఒంటారియో ప్రావిన్స్ లో ఘటన
  • మిస్సిసాగా ప్రాంతంలో చివరి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్న గుర్విందర్
  • పిజ్జా డెలివరీ బాయ్ గా పార్ట్ టైమ్ ఉద్యోగం
  • పిజ్జా ఆర్డర్ చేసి, గుర్విందర్ పై దాడి చేసి వాహనం ఎత్తుకెళ్లిన దుండగులు
  • చికిత్స పొందుతూ గుర్విందర్ కన్నుమూత
కెనడాలో దారుణం చోటుచేసుకుంది. ఓవైపు చదువుకుంటూనే, మరోవైపు పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్న ఓ భారతీయ విద్యార్థి గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో మృతి చెందాడు. ఒంటారియో ప్రావిన్స్ లో ఈ ఘటన జరిగింది. 

24 ఏళ్ల గుర్విందర్ నాథ్ కెనడాలోని మిస్సిసాగాలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. పార్ట్ టైమ్ గా పిజ్జా డెలివరీ బాయ్ గానూ పనిచేస్తున్నాడు. చివరి సెమిస్టర్ కు సిద్ధమవుతున్న గుర్విందర్... చదువు పూర్తికాగానే సొంతంగా పిజ్జా షాప్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 

ఇటీవల ఓ పిజ్జా ఆర్డర్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన గుర్విందర్ పై కొందరు వ్యక్తులు తీవ్రంగా దాడి చేసి అతడి వాహనాన్ని ఎత్తుకెళ్లారు. స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 14న కన్నుమూశాడు. దాడిలో గుర్విందర్ తల, ఇతర శరీర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. 

కాగా, గుర్విందర్ నుంచి వాహనాన్ని ఎత్తుకెళ్లాలన్న పక్కా ప్లాన్ తోనే దుండగులు పిజ్జా ఆర్డర్ చేసినట్టు పోలీసులు విచారణలో గుర్తించారు. కాగా, దుండగులు దాడి జరిగిన ప్రదేశానికి ఐదు కిలోమీటర్ల దూరంలో గుర్విందర్ వాహనాన్ని వదిలేశారు. 

త్వరలోనే దాడికి పాల్పడిన వ్యక్తులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. గుర్విందర్ మృతదేహాన్ని ఈ నెల 27న భారత్ తరలించనున్నారు. గుర్విందర్ నాథ్ మరణించిన నేపథ్యంలో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Gurvinder Nath
Indian Student
Canada
Death
India

More Telugu News