Gyanvapi mosque: జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు సుప్రీం బ్రేకులు!

sc stays varanasi court order on scientific survey of gyanvapi mosque
  • మసీదు ఆవరణలో సర్వేకు వారణాసి జిల్లా కోర్టు ఇటీవల ఉత్తర్వులు
  • ఈ రోజు సర్వే ప్రారంభించిన భారత పురావస్తు అధికారులు
  • దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మసీదు కమిటీ
  • జులై 26 సాయంత్రం దాకా ఎలాంటి సర్వే చేపట్టరాదన్న సీజేఐ బెంచ్
వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. శివలింగం ఉన్నట్లుగా భావిస్తున్న ‘వజుఖానా’ మినహా మసీదు ఆవరణ మొత్తం సైంటిఫిక్ సర్వే చేయాలంటూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై రెండు రోజులపాటు స్టే విధించింది. జులై 26 సాయంత్రం 5 గంటల వరకు మసీదు ప్రాంగణంలో ఎలాంటి సర్వే చేపట్టరాదని స్పష్టం చేసింది.

జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వే చేపట్టేందుకు భారత పురావస్తు విభాగ అధికారుల బృందం సోమవారం చేరుకుంది. సర్వే ప్రారంభించింది. ఇదే సమయంలో దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును మసీదు కమిటీ ఆశ్రయించింది. వారణాసి కోర్టు ఇచ్చిన సర్వే ఆదేశాలపై స్టే విధించాలని కోరింది. ఈ పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం నేడు అత్యవసర విచారణ చేపట్టింది.

సర్వే సమయంలో మసీదు ప్రాంగణంలో పురావస్తు అధికారులు తవ్వకాలు చేపడతారా? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా స్పందిస్తూ.. ‘‘ఒక్క ఇటుకనూ తొలగించట్లేదు. అలాంటి ప్రణాళిక కూడా లేదు. ప్రస్తుతానికి కేవలం కొలతలు, ఫొటోగ్రఫీ, రాడార్‌ ప్రక్రియ మాత్రమే కొనసాగుతోంది. ఇది మసీదు నిర్మాణాలపై ఎలాంటి ప్రభావం చూపించదు’’ అని కోర్టుకు తెలిపారు. మసీదు ప్రాంగణంలో నిర్మాణాల తొలగింపు లేదా తవ్వకాలు చేపట్టట్లేదని వివరించారు. దీంతో వారణాసి కోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. వారణాసి కోర్టు ఆదేశాలపై అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లేందుకు మసీదు కమిటీకి అనుమతినిచ్చింది.
Gyanvapi mosque
Supreme Court
Varanasi Court
scientific survey

More Telugu News