Menstruation: కుమార్తెకు తొలి రుతుస్రావం... కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న తల్లిదండ్రులు

Parents celebrates their daughter first menstruation
  • ఉత్తరాఖండ్ దంపతుల వినూత్న చర్య
  • ఇటీవల రజస్వల అయిన కుమార్తె
  • కొన్ని రోజుల కిందటే తొలి నెలసరి
  • మైల ఆచారాలకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో ఫంక్షన్ నిర్వహణ
  • బంధుమిత్రులను పిలిచి వేడుకలు
అమ్మాయిలకు పెళ్లి, మాతృత్వం ఎలా ముఖ్యమైన ఘట్టాలో... రజస్వల కావడం అనేది కూడా సామాజికపరంగా ఎంతో ప్రాధాన్యతాంశం. ప్రకృతి ప్రకారం స్త్రీలలో రుతుస్రావం అత్యంత సహజ అంశం. 

సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం అమ్మాయిలు రజస్వల కాగానే ఎవరి స్థాయి కొద్దీ వారు భారీగా ఫంక్షన్లు ఏర్పాటు చేస్తారు. అయితే ఉత్తరాఖండ్ కు చెందిన ఓ దంపతులు తమ కుమార్తె తొలి రుతుస్రావాన్ని కూడా ఘనంగా వేడుకలా జరిపారు. 

జితేంద్ర భట్ అనే వ్యక్తి కాశీపూర్ లో తన భార్య, కుమార్తెతో జీవిస్తున్నాడు. కుమార్తె రాగిణి ఇటీవల రజస్వల కాగా, కొన్నిరోజుల కిందట అమ్మాయికి తొలి నెలసరి వచ్చింది. అయితే, రుతుస్రావాన్ని ఇప్పటికీ మైలగా భావించే ఆచారం దేశంలో ఉంది. పైగా, ఇది బహిరంగంగా చెప్పుకునే అంశం కాదన్న ధోరణి పాతుకుపోయింది. నెలసరి వచ్చిన స్త్రీలు ఆలయాలకు వెళ్లరాదు, శుభకార్యాలకు హాజరు కారాదు అనే ఆంక్షలు ఉండనే ఉన్నాయి. 

ఇలాంటి ఆలోచనా విధానాలకు వ్యతిరేకంగా ఎలుగెత్తాలని జితేంద్ర భట్, ఆయన భార్య నిర్ణయించుకున్నారు. తమ కుమార్తె రుతుస్రావాన్ని అందరికీ తెలియజేసేలా భారీగా వేడుక ఏర్పాటు చేశారు. బంధుమిత్రులందరినీ పిలిపించి కుమార్తెతో కేక్ కట్ చేయించి వినూత్న పంథాలో చైతన్యం కలిగించే ప్రయత్నం చేశారు. 

అదే సమయంలో, కుమార్తెకు రుతుస్రావంపై అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. ఇది సిగ్గుపడాల్సిన అంశం కాదని, దాచిపెట్టుకోవాల్సిన అంశం అంతకన్నా కాదని ఉద్బోధించారు. కుమార్తె తొలి రుతుస్రావ వేడుకకు సంబంధించిన ఫొటోలను జితేంద్ర భట్ తన సోషల్ మీడియా ఖాతాలో గర్వంగా పోస్టు చేశారు.
Menstruation
Daughter
Parents
Celebration
Uttarakhand

More Telugu News