Telangana: భారీ వర్షాల నేపథ్యంలో సీఎస్ కు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

CM KCR  has issued several orders to CS Shanti Kumari over rains
  • తక్షణ చర్యలు తీసుకోవాలని సూచన
  • సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
  • ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం
గోదావరి నది పరీవాహక ప్రాంతం ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టవలసిన అత్యవసర చర్యల కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి పలు ఆదేశాలు జారీ చేశారు. 

పోలీసు సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని, సంబంధిత శాఖలను అప్రమత్తం చేస్తూ తక్షణ చర్యలకు ఉపక్రమించాలని సూచించారు. భద్రాచలంలో ముంపుకు అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా యుద్ధప్రాతిపాదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. గతంలో వరదల సందర్భంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలని సీఎం తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్ గా పనిచేస్తున్న దురిశెట్టి అనుదీప్ ను తక్షణమే బయలుదేరి భద్రాచలం వెళ్ళి అక్కడి పరిస్థితులను బట్టి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా వుండాలని సీఎం ఆదేశించారు.

వర్షాలు, వరద సహయ చర్యల కోసం రాష్ట్ర సచివాలయంతో పాటు, కలక్టరేట్లు, ఎమ్మార్వో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. సహాయక చర్యల కోసం హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ దళాలను అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు కంట్రోల్ రూం సహా హెలికాప్టర్లు, సంబంధిత సహాయక చర్యలకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లను చేసిన అధికార యంత్రాంగం, భద్రాచలంలో సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధం చేసింది. రెవెన్యూ, పంచాయితీ రాజ్, వైద్య, ఆరోగ్య శాఖ, డిసాస్టర్ మేనేజ్‌మెంట్ వంటి ఇతర శాఖల అధికారులు అప్రమత్తంగా వుండాలని, దీనికి సంబంధించి సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎస్ కు సూచించారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Telangana
rains
cm kcr
CS

More Telugu News