Rice Exports: బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన

Govt bans export of non basmati rice to keep domestic prices in check
  • బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై గురువారం భారత్ నిషేధం
  • దేశీయంగా ధరల నియంత్రణకు రక్షణాత్మక చర్యలు
  • రష్యా వైఖరితో ఉక్రెయన్ నుంచి ఎగుమతులపై నీలినీడలు
  • భారత్ తాజా చర్యతో ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగే అవకాశం

దేశీయంగా ధరలను అదుపులో పెట్టేందుకు కేంద్రం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. బాస్మతీయేత బియ్యం ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రకటించింది. బాస్మతీయేతర బియ్యాన్ని నిషేధిత ఎగుమతుల జాబితాలోకి చేర్చినట్టు డైరెక్టరరేట్ ఆఫ్ జనరల్ ఫారిన్ ట్రేడ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు, దేశీయంగా బియ్యం ధరలు క్రమంగా పెరుగుతున్నాయని ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించింది. దేశీయ అవసరాలకు సరిపడా నిల్వలు రెడీ చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఇటీవల దేశంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరి పంటకు నష్టం వాటిల్లుతోంది. గత ఏడాది కాలంలో ధరలు 11 శాతం పెరగ్గా, గత నెలలో 3 శాతం మేర పెరిగాయి. వినియోగదారుల మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, భారత్ బియ్యం ఎగుమతుల్లో బాస్మతీయేతర బియ్యం వాటా దాదాపు పాతిక శాతం. బియ్యం ఎగుమతులపై భారత్ ఆంక్షలతో ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావం అంతర్జాతీయంగా ఆహార ధరలపై ప్రభావం చూపుతోంది. ఉక్రెయిన్ నుంచి గోధమ ఎగుమతులు సాఫీగా సాగుతాయని తాము ఇకపై గ్యారెంటీ ఇవ్వలేమని రష్యా తెగేసి చెప్పింది. ప్రపంచంలోని బియ్యం ఎగుమతిదారుల్లో భారత్ అతిపెద్దది. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతవుతున్న బియ్యంలో భారత్ వాటా ఏకంగా 40 శాతం. ఈ నేపథ్యంలో ఎగుమతులపై భారత్ నిషేధం విధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.  

  • Loading...

More Telugu News