Shahrukh Khan: ప్రపంచకప్‌వైపు ఆరాధనగా చూస్తున్న షారూఖ్ ఖాన్.. ఫొటో షేర్ చేసిన ఐసీసీ

King Khan Shah Rukh Khan strikes a pose with World Cup Trophy
  • ఫొటో చూసి కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
  • షారూఖ్‌లానే టీమిండియా కూడా మళ్లీ ఫామ్‌లోకి రావాలంటున్న అభిమానులు
  • అక్టోబరు 8న ఆసీస్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్ 
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ వన్డే ప్రపంచకప్ ట్రోఫీతో ఉన్న ఫొటోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘సీడబ్ల్యూసీ 23 ట్రోఫీతో కింగ్‌ఖాన్’ అని దానికి క్యాప్షన్ తగిలించింది. ప్రపంచకప్ కోసం కోట్లాదిమంది భారతీయులు, ఆటగాళ్లలానే షారూఖ్ కూడా ట్రోఫీ వైపు ఆరాధనగా చూస్తున్నట్టుగా ఉన్న ఈ ఫొటోపై నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. 

1983లో కపిల్‌దేవ్ సారథ్యంలోని భారత జట్టు దేశానికి తొలి ప్రపంచకప్ ట్రోఫీ అందించగా, ఆ తర్వాత 2011లో మహేంద్రసింగ్ కెప్టెన్సీలో రెండో కప్ వచ్చింది. ఇప్పుడు ముచ్చటగా మూడో ట్రోఫీపై భారత జట్టు కన్నేసింది. స్వదేశంలోనే ప్రపంచకప్ జరుగుతుండడం భారత్‌కు కలిసొచ్చే అంశం. అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో భారత్ జట్టు తన తొలి మ్యాచ్‌లో తలపడుతుంది. అదే నెల 15న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్‌ తలపడతాయి. 

ఇక, షారూఖ్ విషయానికొస్తే, క్రికెట్ అంటే ఆయనకు పిచ్చి ప్రేమ. ఎప్పటికప్పుడు మ్యాచ్‌లకు హాజరవుతూ ఉంటాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు యజమాని కూడా. ఇప్పుడు ప్రపంచకప్‌తో ఉన్న షారూఖ్ ఫొటోను చూసి అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. షారూఖ్ లానే టీమిండియా కూడా మళ్లీ ఫామ్‌లోకి రావాలని, ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలని ఓ యూజర్ కామెంట్ చేస్తే.. ‘ప్రపంచకప్‌తో జవాన్.. బోల్డంత ఎంటర్‌టైన్మెంట్’ అని మరో యూజర్ రాసుకొచ్చాడు. కాగా, ఐసీసీ ప్రపంచకప్ 2023 ప్రోమో కోసమే ఈ ఫొటోను తీసినట్టు తెలుస్తోంది.
Shahrukh Khan
ICC World Cup 2023
Team India

More Telugu News