Ahmedabad: యాక్సిడెంట్ జరిగిన చోట గుమికూడిన జనంపైకి దూసుకెళ్లిన కారు.. 9 మంది మృతి

Speeding Jaguar rams into crowd in Ahmedabad kills 9
  • గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదం
  • మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
  • మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఫ్లైఓవర్ పై కారు ప్రమాదం జరగగా.. అక్కడ గుమికూడిన జనంపైకి మరో కారు దూసుకెళ్లింది. దాదాపు 160 కి.మీ. వేగంతో జాగ్వార్ కారు దూసుకెళ్లడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే చనిపోగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇస్కాన్ బ్రిడ్జిపై ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ ప్రమాదాలతో రక్తసిక్తంగా మారిన ఫ్లైఓవర్ ను అధికారులు టెంపరరీగా క్లోజ్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్కాన్ బ్రిడ్జిపై బుధవారం అర్ధరాత్రి ప్రాంతంలో ఓ యాక్సిడెంట్ జరిగింది. ముందు వెళుతున్న డంపర్ ను థార్ జీపు వెనక నుంచి ఢీ కొట్టింది. దీంతో మిగతా వాహనదారులు అక్కడ గుమికూడారు. ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్ కు సాయం చేస్తుండగా ఓ జగ్వార్ కారు వేగంగా దూసుకొచ్చింది. దాదాపు 160 కి.మీ. వేగంతో దూసుకువచ్చి జనాలను ఢీ కొట్టింది. దీంతో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఎమర్జెన్సీ టీం వేగంగా స్పందించి బాధితులను సోలా సివిల్ హాస్పిటల్ కు తరలించింది.

అప్పటికే అందులో తొమ్మిది మంది చనిపోయారని వైద్యులు తెలిపారు. మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. ప్రమాదంపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున అందజేస్తామని, వారికి మెరుగైన వైద్య సాయం అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.
Ahmedabad
Gujarat
Road Accident
jaguar car
9 killed
overspeed

More Telugu News