Vishwak Sen: నా వలన 100 టికెట్లు తెగినా చాలు: 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' ఈవెంటులో విష్వక్సేన్

Annapurna Photo Studio Pre Release Event
  • సరికొత్త ప్రేమకథగా 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో'
  • 1980 నేపథ్యంలో నడిచే కథ 
  • కేజీ టమాటాల కాస్టుతో ఈ సినిమా చూడొచ్చన్న డైరెక్టర్
  • ఇది మంచి సినిమా అని ధైర్యంగా చెబుతానన్న నిర్మాత 
  • పొగడ్తలతో తనని పెద్దోణ్ణి చేయవద్దన్న విష్వక్సేన్   

చైతన్యరావు - లావణ్య జంటగా 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' రూపొందింది. యశ్ రంగినేని నిర్మించిన ఈ సినిమాకి, చెందు ముద్దు దర్శకత్వం వహించాడు. ప్రిన్స్ హెన్రీ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో విష్వక్సేన్ ముఖ్య అతిథిగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులోని 'దసపల్లా' హోటల్లో నిర్వహించారు.

ఈ వేదికపై విష్వక్సేన్ మాట్లాడుతూ .." నేను చాలా క్రింది స్థాయి నుంచి వచ్చాను. అప్పట్లో నా సినిమాల ప్రమోషన్స్ కి కూడా ఇలాగే టెన్షన్ పడ్డాను. అందువల్లనే నేను ఎంతమాత్రం తీరికగా ఉన్నా, ఇలాంటి ఈవెంట్స్ కి వస్తూనే ఉంటాను. అంతమాత్రానికే నేను చాలా చేసేసినట్టుగా నన్ను పొగడొద్దు .. పెద్దవాడిని చేయవద్దు. నేను రావడం వలన ఒక 100 టిక్కెట్లు తెగినా చాలని అనుకునేవాడిని నేను. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను" అన్నారు. 

హీరో చైతన్యరావు మాట్లాడుతూ .. "ఇది 1980ల నేపథ్యంలో నడిచే కథ. అప్పట్లో ఎలా ఉండేదనేది ఈ జనరేషన్ తెలుసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. అప్పటివారు చూస్తూ పాత జ్ఞాపకాలలోకి వెళుతూ ఎంజాయ్ చేస్తారు. అన్నివర్గాల వారు చూసి ఆనందించే సినిమా ఇది. నా కెరియర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుంది" అని అన్నాడు. 

దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ .. "ఈ సినిమా వెనుక రెండేళ్ల కష్టం ఉంది. యశ్ రంగినేని వంటి ఒక మంచి నిర్మాతతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాతో ఆయనను నటుడిగా పరిచయం చేసే అదృష్టం కూడా నాకే దక్కింది. ఒక కేజీ టమాటాల కాస్టుతో మా సినిమాను చూడవచ్చు. ఈ సినిమా అందించే అనుభూతిని మీరు రెండు నెలల పాటు నెమరు వేస్తూనే ఉంటారు" అని  అన్నాడు. 

నిర్మాత యశ్ రంగినేని మాట్లాడుతూ .. "ఇది చిన్న సినిమా కాదు .. మంచి సినిమా. ఒక మంచి సినిమా తీసి చిన్న సినిమా .. చూడండి అంటూ అడగడం సరికాదు. ఒక మంచి సినిమా తీశామని నేను ధైర్యంగా చెబుతున్నాను. ఎక్కడ ఎలాంటి అశ్లీలత లేని సినిమా ఇది. ఒక బాపు గారు .. విశ్వనాథ్ గారు .. సీనియర్ వంశీ గారి సినిమాలు చూసినట్టుగా అనిపించే సినిమా ఇది" అంటూ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News