tomato: గుడ్‌న్యూస్: ఆ ప్రాంతాల్లో ఇక కిలో టమాటా రూ.70 మాత్రమే!

  • గత శుక్రవారం నుండి సబ్సిడీపై టమాటాలు అందిస్తోన్న కేంద్రం
  • తొలుత రూ.90, ఆ తర్వాత తగ్గుతుండటంతో రేపటి నుండి రూ.70కే విక్రయం
  • ఎన్సీసీఎఫ్, నాఫెడ్ ద్వారా సబ్సిడీ టమాటాను అందిస్తోన్న కేంద్రం
Govt cuts price of subsidised tomato to Rs 70 per kg with effect from Thursday

చుక్కలనంటిన టమాటా ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అధిక ధరలు కలిగిన చోట వీటిని సబ్సిడీతో అందిస్తోంది. కిలో టమాటా ఒక్కోచోట రూ.100 నుండి రూ.200 పైగా పలుకుతోంది. అయితే కేంద్రం సామాన్యులకు ఊరటనిస్తూ కొన్నిరోజుల క్రితం కిలో టమాటాను రూ.90కి విక్రయించింది. ఆ తర్వాత రూ.80కి తగ్గించింది. బుధవారం వరకు రూ.80గా ఉన్న సబ్సిడీ టమాటాను గురువారం నుండి రూ.70కే అందించాలని నిర్ణయించింది. గత శుక్రవారం నుండి కేంద్రం సబ్సిడీపై వీటిని అందిస్తోంది.

ప్రభుత్వం తరఫున సహకార సంఘాలు నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్ విక్రయిస్తున్నాయి. టమాటా ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్న దృష్ట్యా జులై 20, 2023 నుండి కిలో ధర రూ.70 చొప్పున రిటైల్ ధరకు టమాటాలను విక్రయించాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ NCCF, NAFEDలను ఆదేశించినట్లు ప్రకటన విడుదలైంది.

వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆదేశాల మేరకు, ఎన్‌సిసిఎఫ్, నాఫెడ్ గత నెలలో రిటైల్ ధరలు గరిష్ఠంగా పెరిగిన ప్రధాన వినియోగ కేంద్రాలలో విక్రయించడం కోసం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని మండీల నుండి టమాటాలను సేకరించడం ప్రారంభించాయి. ఢిల్లీ-ఎన్సీఆర్‌లో టమాటాల రిటైల్ విక్రయం జులై 14, 2023న ప్రారంభమైంది. జులై 18, 2023 వరకు, రెండు ఏజెన్సీలు మొత్తం 391 టన్నుల టమోటాలను కొనుగోలు చేశాయి. ఆ తర్వాత క్రమంగా రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, బీహార్ లలోను విక్రయించాయి.

More Telugu News