చంద్రయాన్-3 సక్సెస్ తో జగన్ రగిలిపోయాడు.... ఎందుకంటే: నారా లోకేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రయాన్-3 సక్సెస్ తో జగన్ రగిలిపోయాడు.... ఎందుకంటే: నారా లోకేశ్

Nara Lokesh speech in K Agraharam of Kondapi constituency
  • కొండపి నియోజకవర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర
  • కె.అగ్రహారంలో భారీ బహిరంగ సభ
  • చంద్రయాన్-3 పేరు నేపథ్యంలో సీఎం జగన్ పై లోకేశ్ వ్యంగ్యం
  • జగన్ పాలనలో బడిలో మాస్టారుకు, స్టేషన్ లో ఎస్సైకి కూడా భద్రతలేదని వెల్లడి
టీడీపీ అగ్రనేత, మాజీ మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేడు కొండపి నియోజకవర్గంలో కొనసాగుతోంది. కె.అగ్రహారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు. కొండపి ప్రాంతం ప్రాశస్త్యం, దివంగత సీనియర్ నేత దామచర్ల ఆంజనేయులు గురించి, పొగాకు రైతుల గురించి ప్రస్తావించారు. సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించడమే కాదు, కొంచెం హాస్యం కూడా ప్రదర్శించారు.

ఎన్టీఆర్ ఇక్కడ పొగాకు బోర్డు ఏర్పాటు చేశారు

 ఇవాళ కొండపి దద్దరిల్లిందని అన్నారు. తన సభకు వచ్చిన భారీ జనసందోహాన్ని చూసి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. చాన్నాళ్లుగా కొండపి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉందని తెలిపారు.

"వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, వల్లూరమ్మ ఆలయం ఉన్న పుణ్యభూమి కొండపి. కొండపి రూపురేఖలు మార్చిన గొప్ప నేత దామచర్ల ఆంజనేయులు గారు. పొగాకు రైతుల కష్టాలు చూసి కొండపిలో పొగాకు బోర్డు ఏర్పాటు చేసింది స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారు. పవిత్రమైన కొండపి నేలపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని వివరించారు.

సజ్జలను పిలిచి చితకబాదాడు!

చంద్రయాన్ 3 సక్సస్ అయ్యింది. జగన్ కి కోపం వచ్చింది. మొన్న జగన్ టీవీ చూస్తుంటే ఇస్రో చంద్రయాన్ 3 సక్సస్ అయ్యింది అనే వార్త వచ్చింది. ఆ వార్త చూసి జగన్ కి విపరీతమైన కోపం వచ్చింది. దాంతో టీవీ పగలగొట్టేశాడు. వెంటనే ప్యాలస్ బ్రోకర్ సజ్జలని పిలిచి చితకబాదాడు. 

పాపం,  సజ్జలకి అర్ధం కాలేదు. అసలు నన్ను ఎందుకు తిడుతున్నాడు అనుకున్నాడు. భయపడుతూనే ఏం జరిగింది సార్ అన్నాడు సజ్జల. చంద్రయాన్ అని పేరు పెడితే ఏం పీకావ్? అధికారంలో ఉన్నది మనమా? చంద్రబాబా? అని అడిగాడు. జగన్యాన్ అని పేరు పెట్టకపోతే ఇస్రో దగ్గరకి జేసీబీ పంపుతాం అని వార్నింగ్ ఇవ్వాలి కదా అన్నాడు. అక్కడికి జేసీబీ పంపితే మనం జీవితాంతం చిప్పకూడు తినాల్సిందే సార్ అన్నాడట సజ్జల. 

ఉపాధ్యాయుడ్ని చంపారు... ఎస్సైపై స్టేషన్ లోనే దాడిచేశారు!

సైకో జగన్ పాలనలో బడిలో పాఠాలు చెప్పే మాస్టారుకి భద్రత లేదు. ఆఖరికి పోలీస్ స్టేషన్ లో పోలీసులకు కూడా భద్రత లేదు. అంగన్వాడీ టీచర్లకు కూడా రక్షణ లేదు. పెద్ద సైకోని చూసుకొని చిన్న సైకోలు రెచ్చిపోతున్నారు. విజయనగరం జిల్లా రాజాంలో ఎంతో మంచి పేరు ఉన్న  ప్రభుత్వ ఉపాధ్యాయుడు కృష్ణని వైసీపీ నేతలు బొలెరోతో గుద్దారు. కొన ఊపిరితో ఉన్న మాస్టారుని రాడ్లతో కొట్టి, కళ్లు పొడిచి చంపేశారు. ఆ దుర్మార్గులను టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే శిక్షిస్తాం. 

ఇంకో పిల్ల సైకో ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే ఎస్ఐ పై దాడి చేశాడు.    సూళ్లూరుపేటలో దళిత ఎస్ఐ రవిబాబు అతని డ్యూటీ చేశారు. రౌడీషీట్ లో ఉన్న వైసీపీ నేత సునీల్ రెడ్డిని కౌన్సిలింగ్ కి పిలిచారు. కానీ, ఆ సునీల్ రెడ్డి ఏకంగా దళిత ఎస్ఐ రవిబాబుపై దాడి చేశాడు. పైగా ఎస్ఐ పై రివర్స్ కేసు పెట్టాడు. పోలీసులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?

 కొండపిని అభివృద్ధి చేసింది టీడీపీ 

కొండపిలో సింహం డోలాబాలవీరాంజనేయస్వామి గారు, సత్య జోడి ఉన్నారు. ఈ ఇద్దరూ నాతో పోరాడి నిధులు సాధించారు. 2014-19 వరకూ రూ.1500 కోట్లతో కొండపిని అభివృద్ధి చేసింది టీడీపీ. నియోజకవర్గంలో డబుల్ రోడ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు, అసలు రోడ్లు లేని గ్రామాలకు తారురోడ్లు, పేదలకు ఇళ్లు, వంతెనలు, రూ.60 కోట్లతో తాగునీటి పథకం ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు పడుతుంది. కానీ తన్నే దున్నపోతు ప్రభుత్వం వచ్చిన తరువాత కొండపికి ఏం చేసింది? గుండు సున్నా. 

కొండపిలో వైసీపీ దిక్కులేని పార్టీ అయిపోయింది

ప్రశాంతంగా ఉండే కొండపిని అరాచకాలకు అడ్డాగా మార్చేశారు. కొండపిలో వైసీపీ ఒక దిక్కులేని పార్టీ. మొదటి ఇంఛార్జ్ దోపిడీకి జనం జడుసుకున్నారు.     రెండో ఇంఛార్జ్ వచ్చాడు. ఆయన దెబ్బకి ప్రజలు, సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇతర ప్రాంతాలకు పారిపోయే పరిస్థితి వచ్చింది. త్వరలో మూడో ఇంఛార్జ్ రాబోతున్నాడు. అక్కడితో ఆగదు... ఎన్నికల లోపు నాలుగో ఇంఛార్జ్ కూడా రావడం ఖాయం. 

స్వామిగారు మన సింహం... వచ్చే ఎన్నికల్లోనూ గెలిపించండి

మన సింహం స్వామి గారు చేసిన తప్పేంటి? తన నియోజకవర్గం అభివృద్ధి గురించి పోరాడటం తప్పా?    అభివృద్ధి చెయ్యమని అడగటం తప్పా? ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి అని నిలదీయడం తప్పా?    ఒక దళిత ఎమ్మెల్యే పై అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఆఖరికి ఆయన చొక్కా చింపి అవమానించారు. అయినా మన సింహం స్వామి గారి డైలాగ్ ఒక్కటే... ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు. 

2024లో స్వామి గారిని భారీ మెజారిటీ తో గెలిపించండి, కొండపిని అభివృద్ధిలో నెంబర్ వన్ చేస్తాం. టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను. అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తా. కొండపిలో ఉన్నా కంబోడియా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా.
Advertisement
Nara Lokesh
K Agraharam
Kondapi
Jagan
Yuva Galam Padayatra
TDP
Andhra Pradesh

More Telugu News