Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీం ముందుకు రాహుల్ గాంధీ!

sc agrees to hear on july 21 appeal of congress leader rahul gandhi in defamation case
  • ‘మోదీ’ వ్యాఖ్యలపై రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సెషన్స్ కోర్టు
  • ఈ తీర్పును సమర్థించిన గుజరాత్‌ హైకోర్టు
  • దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రాహుల్ పిటిషన్
  • ఈ నెల 21న విచారణ జరిపేందుకు అంగీకరించిన ధర్మాసనం
‘మోదీ’ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జులై 21న విచారణ చేపడుతామని వెల్లడించింది. ఈ కేసులో సెషన్స్‌ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్‌ వేసిన స్టే పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు ఇటీవల కొట్టేసిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును రాహుల్ ఆశ్రయించారు. ఈ అప్పీలుపై అత్యవసర విచారణ జరపాలని ధర్మాసనాన్ని రాహుల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోరారు. ఈ నెల 21న లేదా 24న దీనిపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై ఈ నెల 21న విచారణ జరిపేందుకు అంగీకరించింది.

2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం కేసు నమోదైంది. ఈ కేసులో ట్రయల్‌ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మార్చిలో తీర్పు చెప్పింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి.. కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. దీంతో ట్రయల్‌ కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోనే రాహుల్‌పై అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది.

ఈ నేపథ్యంలో సెషన్స్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ గుజరాత్‌ హైకోర్టును రాహుల్ ఆశ్రయించారు. అయితే రాహుల్‌ గాంధీకి కిందికోర్టు శిక్ష విధించడం సరైనదేనని హైకోర్టు పేర్కొంటూ, ఆయన పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో రాహుల్ ఇప్పుడు సుప్రీంకోర్టు గడపతొక్కారు.
Rahul Gandhi
Supreme Court
Defamation case
Gujarat High Court
Congress

More Telugu News