Commonwealth Games: ఖర్చుకు జడిసి.. కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు గుడ్‌బై చెప్పేసిన ‘విక్టోరియా’

Australias Victoria axes plan to host 2026 Commonwealth Games
  • 2026లో కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సిన విక్టోరియా ప్రభుత్వం
  • 6 బిలియన్ డాలర్లు ఖర్చు చేయడం తమ వల్ల కాదంటూ చేతులెత్తేసిన ప్రభుత్వం
  • 12 రోజుల కోసం అంత డబ్బంటే చాలా ఎక్కువన్న విక్టోరియా ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్
  • తమకు ఒనగూరే ఆర్థిక ప్రయోజనాలకంటే ఖర్చే ఎక్కువన్న ఆండ్రూస్
కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడమంటే మామూలు విషయం కాదని, బోల్డంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని తెలిసి రావడంతో ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. 2026 కామన్వెల్త్ గేమ్స్‌కు విక్టోరియా ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా 6 బిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు (4 బిలియన్ అమెరికా డాలర్లు) ఖర్చు పెట్టాల్సి వస్తుండడంతో అన్ని నిధులు తాము వెచ్చించలేమంటూ నిన్న ప్రకటించింది. విషయాన్ని కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (సీజీఎఫ్), కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియా దృష్టికి తీసుకెళ్లి ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కోరింది. 

విక్టోరియా ప్రాంతంలో హౌసింగ్, పర్యాటకం, క్రీడా మౌలిక సదుపాయాల వంటి ప్రయోజనాలు ఉంటాయన్న ఉద్దేశంతోనే గేమ్స్ నిర్వహణకు ముందుకొచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది. 12 రోజుల గేమ్స్ కోసం 6 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టడం చాలా ఎక్కువని, ఆతిథ్యం నుంచి వెనక్కి తగ్గడానికి అదే ప్రధాన కారణమని విక్టోరియా ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. క్రీడల ద్వారా తమ రాష్ట్రానికి వస్తాయనుకున్న ఆర్థిక ప్రయోజనాలకు ఇది రెండు రెట్ల కంటే ఎక్కువని పేర్కొన్నారు. గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం కంటే విక్టోరియా ప్రాంత అభివృద్ధికి 2 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రభుత్వం అందిస్తుందని ఆయన వివరించారు.
Commonwealth Games
Australia
Victoria

More Telugu News