Supreme Court: వందేభారత్ రైలు అక్కడ ఆగేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్.. సుప్రీంకోర్టు అసహనం

SC Rejects Plea Seeking Direction To Ensure Vande Bharat Train Stops At Tirur In Kerala
  • తిరూర్ లో వందేభారత్ రైలు స్టాప్ ఉండేలా ఆదేశించాలని పిటిషన్
  • అది ప్రభుత్వ విధాన పరిధిలోకి వస్తుందని సుప్రీం స్పష్టీకరణ
  • అధికారుల వద్దకు వెళ్లాలని పిటిషనర్ కు సూచన
కేరళలోని తిరూర్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ రైలు ఆగేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ‌పిటిషన్ పట్ల సుప్రీంకోర్టు సోమవారం అసహనం వ్యక్తం చేసింది. ఇది ప్రభుత్వ విధాన పరిధిలోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు పీటీ శీజిష్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.  

కేరళలోని మలప్పురం జిల్లాలోని తిరూర్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ రైలుకు హాల్ట్ ఇచ్చేలా దక్షిణ మధ్యరైల్వేకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శీజిష్ తొలుత కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలుత వందే భారత్ ను తిరూర్ లో ఆపాలని నిర్ణయించినప్పటికీ, రాజకీయ కారణాలతో రైల్వే శాఖ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు అందులో పేర్కొన్నారు. హైకోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు.

చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణకు విముఖత వ్యక్తం చేసింది. 'వందే భారత్‌ను తిరూర్‌లో ఆగాలని మీరు కోరుకుంటున్నారు. కానీ ఈ విషయమై మేం ప్రభుత్వానికి చెప్పలేం. ఇది ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు తిరూర్ లో స్టాప్ కోరుకున్న మీరు.. ఆ తర్వాత ఢిల్లీ-ముంబై రాజధాని స్టాప్ ఎక్కడుండాలో కూడా మమ్మల్ని షెడ్యూల్ చేయమంటారా? దీని కోసం అధికారుల వద్దకు వెళ్లండి' అని ధర్మాసనం స్పష్టం చేసింది.

రైలు ఎక్కడెక్కడ ఆగాలనేది రైల్వే శాఖ నిర్ణయిస్తుందని, డిమాండ్ చేసే హక్కు ఎవరికీ లేదని తెలిపింది. ముఖ్యంగా వందేభారత్ వంటి స్పీడ్ కలిగిన రైళ్ల విషయంలో డిమాండ్ల ప్రాతిపదికన నిర్ణయించడం సరికాదని, ప్రతి జిల్లా నుండి ఓ వ్యక్తి తమకు నచ్చిన రైల్వే స్టేషన్ లో స్టాప్ ఉండాలని డిమాండ్ చేస్తే, హైస్పీడ్ రైళ్ల ఏర్పాటుకు ప్రయోజనం లేకుండా పోతుందని తెలిపింది. కనీసం తన పిటిషన్ ను పరిశీలించేలా అధికారులకు సూచించాలని కోరగా.. అసలు ఇందులో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
Supreme Court
Vande Bharat
Kerala

More Telugu News