Cheetahs: భారత్ లో కొనసాగుతున్న విదేశీ చీతాల మరణాలు... కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు

Cheetahs deaths sparkling criticism and Congress slams Center
  • ఏడు దశాబ్దాల కిందట భారత్ లో అంతరించిన చీతాల జాతి
  • నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి చీతాలను తెప్పించిన కేంద్రం
  • మోదీ చేతుల మీదుగా మధ్యప్రదేశ్ కునో పార్క్ లో విడుదల
  • ఇప్పటివరకు 8 చీతాల మృతి
  • సహజ కారణాలతోనే మరణించాయన్న కేంద్రం

దాదాపు 70 ఏళ్ల కిందట భారత్ లో అంతరించిపోయిన చీతాలను మళ్లీ వృద్ధి చేయడం కోసం, నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి పలు చీతాలను తీసుకురావడం తెలిసిందే. వీటిని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మధ్యప్రదేశ్ లోని కునో అభయారణ్యంలో వదిలిపెట్టారు. అనూహ్యరీతిలో ఈ చీతాలు మృత్యువాతపడుతున్నాయి. 

కొన్నిరోజుల కిందటే సూర్య, తేజ అనే రెండు చీతాలు మరణించాయి. దాంతో ఇప్పటివరకు చనిపోయిన చీతాల సంఖ్య 8కి పెరిగింది. ప్రాజెక్ట్ చీతాలో ఆఫ్రికా దేశాల నుంచి తీసుకువచ్చిన చీతాలు భారత్ లో మరణిస్తుండడంపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ స్పందించింది. 

చీతాల కదలికలను గుర్తించేందుకు వీలుగా వాటికి అమర్చిన రేడియో ఐడెంటిటీ కాలర్స్ కారణంగానే అవి మరణించాయన్న ఆరోపణలను ఖండించింది. రేడియో కాలర్స్ కారణంగా చీతాలు చనిపోతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేసింది. శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఊహాగానాలు వ్యాప్తి చేయొద్దని సూచించింది. సహజ కారణాల వల్లనే చీతాలు మృతి చెందాయని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

అయితే, కేంద్రం స్పందనపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు. కునో నేషనల్ పార్క్ లో చీతాల మరణాలు సహజ మరణాలేనని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చేసిన ప్రకటన చూస్తుంటే, నిర్వహణ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు రాజకీయ కోణంలో చేసిన ప్రకటనగా భావించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇది జంతు సంరక్షణ శాస్త్రాన్ని అపహాస్యం చేయడమేనని జైరాం రమేశ్ విమర్శించారు.

  • Loading...

More Telugu News