Viral Video: మధ్యప్రదేశ్‌లో మరో దారుణం.. ముగ్గురు యువకులను అర్ధనగ్నంగా మార్చి కర్రలతో దాడి.. వీడియో ఇదిగో!

3 Men Stripped Naked and Viciously Beaten With Sticks In Madhya Pradesh
  • అరడజను మంది కలిసి కర్రలతో చితకబాదిన వైనం
  • వారిని ప్రోత్సహించిన గ్రామస్థులు
  • దెబ్బలకు తాళలేక బాధితుల కేకలు

మధ్యప్రదేశ్‌లో రోజుకో దారుణం వెలుగులోకి వస్తోంది. ప్రజలపై హింసాత్మక దాడులకు లెక్కలేకుండా పోతోంది. ఇటీవల సిద్ధి జిల్లాలో ఓ ఆదివాసీ వ్యక్తిపై మూత్ర విసర్జన చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ తర్వాత ఓ వ్యక్తితో కొందరు కాళ్లు నాకించిన వీడియో వైరల్ అయి కలకలం రేపింది. తాజాగా మరో దారుణమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ముగ్గురు వ్యక్తులను అర్ధనగ్నంగా మార్చి కిందపడేసిన కొందరు వ్యక్తులు వారిని కర్రలతో చితకబాదారు. శరీరంపై పడుతున్న దెబ్బలకు తాళలేని బాధితులు బాధతో అరుస్తుండడం వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ఆరేడుగురు వ్యక్తులు వారిని విచక్షణ రహితంగా చావబాదుతుంటే చుట్టూ గుమికూడిన వారు వారిని ప్రోత్సహిస్తుండడం గమనార్హం. 

పోలీసుల కథనం ప్రకారం నర్మదాపురం జిల్లాలోని జవ్లీ గ్రామంలో ఈ నెల 13న జరిగిందీ ఘటన. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. గ్రామస్థులతో అసభ్యకరంగా ప్రవర్తించడమే ఈ దాడికి కారణమని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News