Pawan Kalyan: రోడ్డుమీదికి వచ్చి పోరాటాలు చేయగల ఆమంచి స్వాములు వంటి నేత కోసం చాలాకాలం ఎదురుచూశా: పవన్ కల్యాణ్ 

  • జనసేనలో చేరిన వైసీపీ నేత ఆమంచి స్వాములు
  • కండువా కప్పి సాదర స్వాగతం పలికిన పవన్ కల్యాణ్
  • ఆమంచి స్వాములు జనసేనలో చేరడం శుభపరిణామం అని వెల్లడి
  • ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తమను ఎవరు అడ్డుకుంటారో చూస్తామని ధీమా
Pawan Kalyan opines on Amanchi Swamulu joining Janasena

మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరిన సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ ఆమంచి శ్రీనివాసులు (స్వాములు) జనసేనలో చేరడం చాలా ఆనందం కలిగిస్తోందని తెలిపారు. ఆమంచి స్వాములకు పార్టీ కండువా కప్పిన అనంతరం పవన్ మాట్లాడారు.

"ఆయనది చీరాల, నేను కూడా చీరాలలో పెరిగినవాడ్నే. ఆయన చీరాల అనుచరవర్గంతో వస్తారనుకున్నాను... కానీ గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోనూ ఆయనకు అభిమానవర్గం ఉండడం ఆనందం కలిగించింది. ఆమంచి స్వాములును మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. 

కార్యకర్తలకు అండగా నిలబడి, రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేయగల ఆమంచి స్వాములు వంటి నేతలు జనసేనలో ఉండాలని కోరుకునేవాడ్ని. ఇవాళ ఆయన పార్టీలోకి రావడం శుభపరిణామం. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ ఎదుగుదలను ఎవరు అడ్డుకుంటారో చూద్దాం" అని వ్యాఖ్యానించారు. 

కాగా, సోమవారం నాడు తాను తిరుపతి వెళ్లనుండడంపైనా పవన్ కల్యాణ్ మాట్లాడారు. "శ్రీకాళహస్తిలో మన నాయకుడిపై చెయ్యి పడింది అంటే అది నాపై పడినట్టే. అందుకే తిరుపతి వెళుతున్నాను, తేల్చుకుంటాను. జనసేనలోని ఏ ఒక్క నేత, కార్యకర్తపై అయినా దాడి జరిగితే అది నాపై జరిగినట్టే భావిస్తాను... నేను వచ్చి నిలబడతాను... జాగ్రత్త!" అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు.


పవన్ వంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి సీఎం అవ్వాల్సిన అవసరం ఉంది: ఆమంచి స్వాములు

వైసీపీ నేత ఆమంచి స్వాములు ఇవాళ జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్న ఆమంచి స్వాములు, జనసేనలో చేరడం పట్ల స్పందించారు. బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అండగా ఉండే పార్టీ జనసేన అని కొనియాడారు. ఈ రోజు అలాంటి పార్టీలో చేరడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ రాష్ట్రానికి పవన్ కల్యాణ్ వంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉందని, తామంతా ఆయన వెనుక నడుస్తామని చెప్పారు.

More Telugu News