YS Sharmila: అర్హుల పొట్ట కొట్టు.. బందిపోట్లకు పెట్టు: వైఎస్ షర్మిల ఆగ్రహం

YS Sharmila on podu land pattas
  • పోడు పట్టాలలో అక్రమాలు జరుగుతున్నాయన్న షర్మిల
  • డబుల్ బెడ్రూం ఇళ్ల నుండి దళిత బంధు వరకు అక్రమాలేనని ఆరోపణ
  • గిరిజనులకు దక్కాల్సిన భూముల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం
  • గిరిజనుల స్థానంలో బీఆర్ఎస్ లీడర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు పోడు పట్టాలు

కేసీఆర్ పాలనపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవి బిడ్డల కోసం చేపట్టిన పోడు పట్టాలలో అక్రమాలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పదేళ్లుగా దొర అమలు చేసిన ప్రతి పథకం తీరు 'అర్హుల పొట్ట కొట్టు.. బందిపోట్లకు పెట్టు' విధంగానే ఉందన్నారు. పేదలకు దక్కాల్సిన పథకాలన్నీ బీఆర్ఎస్ దొంగల పాలవుతున్నాయని ఆరోపించారు.

డబుల్ బెడ్రూం ఇళ్ల నుండి దళిత బంధు వరకు అన్నీ అక్రమాలేనన్నారు. అన్ని పథకాల్లోను బందిపోట్ల దోపిడీలే కనిపిస్తున్నాయన్నారు. ఏ పథకమూ పేదలకు అందలేదని, లబ్ధి చేకూరింది దొరగారి అనుచరులకేనని విమర్శించారు. 9 ఏళ్లుగా  ఊరించి ఇప్పుడు తీసుకొచ్చిన అరకొర 4 లక్షల పోడుపట్టాలనూ కేసీఆర్ అండ్ కో వదిలి పెట్టలేదన్నారు. గిరిజనులకు దక్కాల్సిన భూముల్లో అక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటు అన్నారు. అర్హులను పక్కకునెట్టి డబ్బులు ముట్టజెప్పిన వారికే పోడు పట్టాలు ఇవ్వడం కేసీఆర్ అండ్ బ్యాచ్‌కే చెల్లిందన్నారు.

గిరిజనుల స్థానంలో బీఆర్ఎస్ లీడర్లు, ప్రభుత్వ ఉద్యోగులు పోడు పట్టాలు పొందడం దొరగారి పాలన దక్షతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. పోడు పట్టాల పంపిణీలో కేసీఆర్ ప్రభుత్వం డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం పంచిన 4 లక్షల ఎకరాల్లో ఎంతమంది అర్హులకు పట్టాలు ఇచ్చారు? ఎంతమంది అనర్హులకు కట్టబెట్టారు? ప్రభుత్వ ఉద్యోగులకు పట్టాలు ఇవ్వడం ఏమిటి? గిరిజనులకు బదులు గిరిజనేతరులకు ఎలా పట్టాలు ఇచ్చారు? పట్టాల కోసం దరఖాస్తు పెట్టని వాళ్లకు ఎలా పట్టాలు ముట్టజెప్పారు? ఈ అంశాలపై వెంటనే విచారణ కమిటీ వేసి పూర్తిస్థాయిలో దర్యాఫ్తు జరపాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News