KTR: ప్రాజెక్టుల విషయంలో కేంద్రం వైఖరిపై కేటీఆర్ ఆగ్రహం

KTR letter about Telangana Projects
  • పాలమూరుకు పర్యావరణ అనుమతులు పక్కన పెట్టారని ఆగ్రహం
  • నదీ జలాల నుండి ప్రాజెక్టుల వరకు అన్నింటా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపణ
  • కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని డిమాండ్

ప్రాజెక్టుల విషయంలో కేంద్ర వైఖరిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి రెండో దశ పర్యావరణ అనుమతుల కోసం గురువారం కేంద్రానికి లేఖ రాశారు. పర్యావరణ అనుమతులు ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. 

తొమ్మిదేళ్లయినా ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. పాలమూరుకు పర్యావరణ అనుమతులను పక్కన పెట్టారని మండిపడ్డారు. నదీ జలాల వినియోగం నుండి ప్రాజెక్టుల నిర్మాణం దాకా అన్నింటా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఆటంకాలు సృష్టిస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే శక్తులపై తప్పకుండా పోరాటం చేస్తామన్నారు.

అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లయినా కీలక ప్రాజెక్టులపై, కృష్ణా జలాల్లో వాటా తేల్చడంపై తాత్సారం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ విషయంలో కేంద్ర సహాయ నిరాకరణ ఉన్నప్పటికీ తాము ముందుకు సాగుతున్నామన్నారు. తెలంగాణ పట్ల తమ సంకల్పాన్ని, నిబద్ధతను అడ్డుకోలేరన్నారు. తెలంగాణ కోసం తాము రాజీలేకుండా పోరాటం చేస్తామన్నారు. కేంద్రంలోని బీజేపీ ఆదినుండి తెలంగాణపై వివక్ష చూపిస్తోందన్నారు. ప్రాజెక్టులపై అంతులేని వివక్ష చూపిస్తోందని అన్నారు.

తాగు, సాగునీరు ప్రాజెక్టులకు సహకరించదని, అలాగే తాము కట్టుకుంటామంటే అనుమతులు ఇవ్వరని ఆరోపించారు. అడుగడుగునా కొర్రీలు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ సస్యశ్యామలం కావడం కేంద్రానికి ఇష్టం లేదన్నారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో న్యాయం చేస్తోందని, కానీ తెలంగాణకు మాత్రం అంతా అన్యాయమే అన్నారు. తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News