Mallu Bhatti Vikramarka: ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్‌కే పేటెంట్.. అది మా మానస పుత్రిక: భట్టి విక్రమార్క

  • ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్న భట్టి
  • రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపాటు
  • రైతులకు మరింత నాణ్యమైన కరెంట్ ఇవ్వాలన్నదే తమ విధానమని వెల్లడి
Bhatti Vikramarka fires on BRS party

తెలంగాణలో ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరిస్తోందని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పేటెంట్‌ అని చెప్పారు. 


‘‘ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పేటెంట్.. అది మా మానసపుత్రిక. ఎవ్వరూ ఊహించని సమయంలో, ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా.. నాడు కాంగ్రెస్ ఆ పథకాన్ని అమలు చేసింది. ఇప్పుడు ఎవరో వచ్చి ఉచిత కరెంటు ఇస్తున్నామని చెబితే.. అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటి ఉండదు” అని అన్నారు. 

ఉచిత విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఉచిత కరెంట్ ఇవ్వాలన్నది తమ విధానమని చెప్పారు. రైతులకు మరింత నాణ్యమైన విద్యుత్‌ను అందించాలన్నదే తమ ఉద్దేశమని భట్టి తెలిపారు. త్వరలో ‘సెల్ఫీ విత్ జలయజ్ఞం’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. తాము మొదలుపెట్టిన ప్రాజెక్టుల వద్దకు వెళ్లి.. సెల్ఫీ తీసుకుని, ఆ ప్రాజెక్టు సమగ్ర సమాచారాన్ని అందరికీ ఇస్తామని అన్నారు.

More Telugu News